- డిప్యూటీ సీఈఓ ఎన్. శిరీష
మోతె, (ఆంధ్రప్రభ): విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఈఓ ఎన్. శిరీష హెచ్చరించారు. మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో శుక్రవారం నిర్వహించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరం కార్యక్రమానికి ఆమె ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని తెలిపారు. తెలిసి తెలియక జరిగే చిన్న పొరపాట్లు సరిచేసుకోవచ్చని, కానీ కావాలనే జరిగే తప్పులను మాత్రం తప్పుగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.
2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జరిగిన సోషల్ ఆడిట్‌లో మొత్తం 385 పనులకు రూ.5 కోట్ల 50 లక్షల 87 వేల 549 రూపాయలు కూలీల రూపంలో, రూ.26 లక్షల 45 వేల 596 రూపాయలు సామాగ్రి రూపంలో ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే రూ.4 లక్షల 99 వేల రూపాయలు రికవరీకి ఆదేశించినట్లు వెల్లడించారు.
టెక్నికల్ అసిస్టెంట్ల నిర్లక్ష్యంతో రికార్డుల పరిశీలన, కొలతల సమతుల్యతలో లోపాలు కనిపించాయని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, అంబుడ్స్‌మెన్ డి.లచ్చిరామ్ నాయక్, హెచ్‌ఆర్ మేనేజర్ వి.పద్మనాభం, క్వాలిటీ కంట్రోల్ అధికారి టి.రామకృష్ణ, ఏఈ రంగా రావు, ఏపిఎం నాగేష్, ఎస్‌ఆర్‌పి చెన్నకేశవులు, ఈసీ శ్రీహరి, ఏవిఓ ఆశారాణి, టిఏలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

