ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
- మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
- డీసీపీ రాజమహేంద్ర నాయక్
జనగామ, ఆంధ్రప్రభ : విద్యా సంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో ర్యాగింగ్, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ… విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి ఎంతో గౌరవ ప్రదమైన వైద్య వృత్తి చేపట్టేందుకు మెడికల్ కాలేజీ లో చేరారని, ఇక్కడ పరస్పర గౌరవం, క్రమశిక్షణ పాటించడంతో పాటు మత్తు పదార్థాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
ర్యాగింగ్ ఘటనలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయండి అని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు వాడినా లేదా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని డీసీపీ రాజమహేంద్ర నాయక్ హెచ్చరించారు. చెడు వ్యసనాలతో భవిషత్తు నాశనం చేసుకోవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు.పోలీస్ సిబ్బంది, కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాగింగ్, డ్రగ్స్‌కు నో చెప్పండి అంటూ విద్యార్థులచే అవగాహన ప్రతిజ్ఞ చేశారు.

