ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో శుక్రవారం ట్రేడింగ్ ను మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో ప్రారంభంలోనే సూచీలు పెద్దఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, మెటల్ స్టాక్స్ కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, ఎంఅండం, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లలో విక్రయాలతో మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 1016 పాయింట్లు నష్టపోయి 73,595 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 309 పాయింట్లు కుంగి 22,235 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్ఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, ఇన్ఫోసిస్, ఎంఅండం, మారుతీ సుజుకీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, జొమాటో, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 73.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,880.60 డాలర్ల వద్ద కదలాడుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 87.33 వద్ద కొనసాగుతోంది.