మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి

మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి

  • నెలపొడుపు వేదిక డిమాండ్

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక డిమాండ్ చేసింది. శనివారం జిల్లా కేంద్రంలోని స్వాతంత్ర్య సమరయోధుడు సుదర్శన్‌రావు నివాసంలో వేదిక ఆధ్వర్యంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఇప్పటివరకు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

సుమారు రెండువందల సంవత్సరాల క్రితం జన్మించిన మహాత్మా ఫూలే అట్టడుగు వర్గాలు, మహిళల విద్యాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు. అంటరానితనం, అస్పృశ్యత, కులవివక్ష నిర్మూలనకు కృషి చేసి సమానత్వ సమాజం కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. సత్యశోధక్ సమాజం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని, రైతుల గిట్టుబాటు ధరల కోసం కూడా ఉద్యమించారని తెలిపారు.

అలాగే సమాన విద్య కోసం హంటర్ కమిషన్‌కు నివేదిక సమర్పించిన విషయాన్ని ప్రస్తావించారు. వితంతువులు, అనాధలకు ఆశ్రయం కల్పించి శరణాలయాల ద్వారా సేవలందించిన ఆదర్శ వ్యక్తి అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారం ప్రదానం చేసి గౌరవించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వేదిక అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య, గౌరవ అధ్యక్షుడు కందికొండ మోహన్, ప్రధాన కార్యదర్శి వహీద్ ఖాన్, హెచ్. రమేష్ బాబు, ఎదిరెపల్లి కాశన్న, కల్వకోల్ మద్దిలేటి, దేవరపాగ ప్రభాకర్, ఎం.డి. ఖాజా, న్యాయవాది రాంబాబు, కురాకుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply