ఆప‌రేష‌న్ సింధూర్ పై త్రివిధ‌ దళాధిపతుల వివ‌ర‌ణ !

ఆపరేషన్ సిందూర్ ను వివ‌రిస్తూ భారత సాయుధ దళాధిప‌తులు ఈరోజు (ఆదివారం) సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (DG ఎయిర్ ఆప్స్) అవధేష్ కుమార్, నావల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (DGNO) రియర్ అడ్మిరల్ A.N. ప్రమోద్ నాయకత్వం వహిస్తున్నారు.

ఈ విలేకరుల సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు ఆపరేషన్ పురోగతిని, వ్యూహాత్మక దృక్పథాన్ని దేశ ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో ఎయిర్ ఆపరేషన్స్ డిజీ మాట్లాడుతూ.. గైడెడ్ మిస్సైల్స్‌తో రెండు ఉగ్ర సంస్థ‌ల శిభిరాల‌ను ద్వంసం చేశామని… పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 4, పాకిస్తాన్‌లో 5 ఉగ్ర శిబిరాలను నిర్వీర్యం చేసినట్లు వివరించారు.

9 ఉగ్ర‌ శిబిరాలు ధ్వంసం

“పౌరులు లేదా సైనిక స్థావరాలు మా లక్ష్యం కావు. ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు నిర్వహించాం,” అని ఎయిర్ ఆపరేషన్స్ డిజీ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 9 శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన ప్రకటించారు.

మే 8, 9 తేదీల్లో పాక్ డ్రోన్లు భారత భూభాగంలోకి చొరబడ్డాయని, జమ్ము, ఉధంపూర్, పఠాన్‌కోట్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు పాల్పడిందని తెలిపారు. శ్రీనగర్ నుంచి నలియా వరకు పాక్ డ్రోన్లు వచ్చినట్టు వెల్లడించారు. అయితే భారత రక్షణ వ్యవస్థ ప్రతి పాక్ డ్రోన్‌ను నిర్వీర్యం చేసినట్టు చెప్పారు.

ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు..

పాక్ దాడులు జరిపితే.. భారత్ కూడా ప్రతిస్పందించడానికి వెనుకాడదని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేవరకు దాడులు కొనసాగుతాయని తెలిపారు. భారత ఎయిర్ డిఫెన్స్ బ్రహ్మాండంగా పనిచేసిందని అధికారులు తెలిపారు.

పాక్ డ్రోన్లు భారత ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి ప్రయత్నించాయి. అయితే మన ఎయిర్ డిఫెన్స్ అద్భుతంగా తిప్పికొట్టిందన్నారు. పాక్ డ్రోన్ దాడి తర్వాత ప్రతిదాడి తప్ప వేరే మార్గం లేకుండా పోయిందని వివరించారు.

ఆరంభంలో భారత్ పాక్ ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించిందని, కానీ పాక్ కవ్వింపు చర్యలతో పరిస్థితులు మారాయని తెలిపారు.

పాక్ డీజీఎంఓ కాల్పుల విరమణకు అభ్యర్థించింది. అనంతరం సీజ్ ఫైర్‌ను ఉల్లంఘించింది. పాక్ డీజీఎంఓతో రేపు మరోసారి భారత్ చర్చలు జరపనుంది. పాక్ మళ్లీ సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తే భారత్ ప్రతిస్పందన సీరియస్‌గా ఉంటుందన్నారు. భారత ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే సహించేది లేదు. అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరచిపోదని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply