KNL | దేశంలో అవధులు దాటిన రాజ్యహింస.. ప్రొ.హరగోపాల్

కర్నూల్ బ్యూరో : దేశంలో నలుమూలలా ఫాసిజం విస్తరించిందని, తద్వారా రాజ్యహింస అవధులు దాటిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కర్నూలు నగరంలో నిర్వహించిన విరసం సాహిత్య పాఠశాల బహిరంగ సభకు ఆయన ప్రధాన వక్తగా హాజరయ్యారు. రచయితల దృక్పథంలో మార్పురావడం కాదని, ప్రవర్తనలో మార్పు రావాలన్నారు. భారతీయ సమాజంలో అంబేద్కర్ తర్వాత గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తిగా వరవరరావ్ కనపడతాడని, సాహిత్యంలో ప్రధాన భూమిక పోషించి ఉంటే ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చేదన్నారు. విప్లవోద్యమం నిర్మించేవారు ఎవరు అన్నప్పుడు విలువలకు, నిజాయితీ, త్యాగాలు చేసి ఆచరణలో చూపేవారన్నారు. దీనికి ఉదాహరణగా సాయిబాబాని పేర్కొనవచ్చన్నారు. గ్రామస్సి తర్వాత అంత గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తి భారతీయ సమాజంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన సాయిబాబా మాత్రమేన‌న్నారు. గ్రాంసీ జీవితానికి సాయిబాబా జీవితానికి సారూప్యత ఉందన్నారు. అందుకే సాయిబాబా పట్ల డాక్టర్స్ కు, న్యాయమూర్తులకు, గవర్నర్లకు సానుభూతి ఉండేదన్నారు. రచయితలు సామాన్య జనానికి సాహిత్యం తీసుకెళ్లడంలో మనం వెనకబడ్డామని అర్థమవుతుందన్నారు.

మన భాషలో మార్పు రావాలన్నారు. ఫాసిజం, రాజ్య హింస తీవ్రమవుతున్న సందర్భంలో మన పాత్ర ఏమిటో నిర్ధారించుకోవాలన్నారు. గుజరాత్ నమూనా ఎంత దుర్మార్గమైనదో మనందరికీ తెలుసని, అటువంటి నమూనాన్ని దేశమంతా రుద్దుతామనడం దుర్మార్గానికి సంకేతమ‌న్నారు. పెట్టుబడిదారులు – రాజ్యం ఏకమైందన్నారు. ఒక అమానవీయ భావజాలం ఏర్పడిందన్నారు. ఉద్యమంలో ఉంటే విప్లవం మీద విప్లవోద్యమాల మీద విశ్వాసం విపరీతంగా ఉంటుందన్నారు. కుంభమేళాలో వేలమంది చనిపోతే దేనికి నిదర్శనమ‌ని, సంస్కృతిని సీరియస్ గా తీసుకోలేదన్నారు. ప్రజా సంస్కృతి రాజకీయ ఆర్థిక కోణాల్లో చూస్తామని, వాళ్ళు సంస్కృతికి కొత్త అర్థం చెప్తున్నారన్నారు. కుంభమేళాలో 40కోట్ల మంది మునిగితే దేశం ఎందుకు విముక్తి అవ్వలేదన్నారు. అభివృద్ధి చెందుతుంటే మనం ఎదుర్కొనడంలో విఫలమయ్యామన్నారు. గాంధీని చంపడం వల్లనే అధికారానికి కాస్త ఆలస్యంగా వచ్చారని, లేకుంటే వారు 30ఏళ్ల క్రితమే వచ్చేవారన్నారు. మనం మన పాత్ర ఏమిటని నిర్దేశించుకోవాలన్నారు. మేధావులు జ్ఞానాన్ని భాషగా మార్చాలన్నారు. పాటను పాడటం వేరు, సృష్టించడం వేరన్నారు. ఇటీవల కాలంలో రచయితలు ప్రజలకు దగ్గర అయ్యే సాహిత్యాన్ని సృష్టిస్తున్నారని, ఇది ఆశాజనకంగా భావిస్తున్నానన్నారు. బహిరంగ సభకు నాగేశ్వరా చారి అధ్యక్షత వహించారు.

ఈ సభల్లో దాదాపు 27 పుస్తకాలు ఆవిష్కరించారు. తెలుగు సాహిత్యంలో వెలుగునీడలు అన్న అంశంపై వరలక్ష్మి అధ్యక్షత వహించగా విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడారు. మధ్యాహ్నం విప్లవోద్యమంపై ఫాసిస్ట్ యుద్ధం – బుద్ధి జీవుల పాత్ర అంశంపై సాగర్ అధ్యక్షత వహించగా, పాణి మాట్లాడుతూ.. ప్రజల గుండెలపై కార్పొరేట్ మొక్కలను నాటుతున్నారని, రాజ్యాంగం పరువు తీస్తున్నారన్నారు. వనరులను దోచుకోవడమే లక్ష్యంగా రాజ్యం కొనసాగుతుందన్నారు. మతోన్మాదం రెచ్చగొట్టి హిందువులను ఐక్యం చేస్తూ వ్యూహాత్మక ఎత్తుగడలకు పాల్పడుతున్నారని, ఇది ఫాసిజం దుర్మార్గానికి సంకేతమ‌న్నారు. వీటన్నింటికీ వెన్నముక్క కార్పొరేట్ హిందుత్వ శక్తుల ప్రభావమ‌న్నారు. తలారి స్వభావం కార్పొరేట్ నైజమ‌ని అన్నారు.

మత కార్యక్రమాల్లో కార్పొరేట్ శక్తులు ఉన్నాయని, కార్పొరేట్ హిందుత్వ భావజాలం అభివృద్ధి అయిందని సంస్కృతి భావజాలం మీదనే హిందుత్వం భావజాలం ఆధారపడి ఉందన్నారు. కార్పోరేట్లే బీజేపీని అధికారంలోకి తెచ్చారని, అందుకే నమో కార్పొరేట్ల స్నేహితుడయ్యాడన్నారు. వికసిత భారత్ ఇదేనా అని ప్రశ్నించారు. ఈ రెండు రోజుల సభల్లో నాయకుల అరసవిల్లి కృష్ణ, రివేరా, శశికళ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన విరసం ప్రతినిధులు హాజరయ్యారు. సభలో ప్రగతిశీల కవిత్వాన్ని కవులు చదివి వినిపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ప్రదర్శన చేశారు. సభలో కర్నూలుకు చెందిన కవులు మారుతి పౌరోహితం, ఎస్ డి వి అజీజ్, వెంకటేష్, ఏవీ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *