ముగింపు దశలో షట్‌డౌన్
- ఊపిరీ పిల్చుకుంటున్న అమెరికన్లు
- 41వ రోజుకు చేరిన షట్‌డౌన్
- మూడు రోజులుగా నిలిచిన విమాన సర్వీస్‌లు
- ఈ రోజు 2700 విమానాలు రద్దు
- కళ్లు తెరిచిన రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలు
- అధ్యక్షుడు ట్రంప్‌కు అనుకూలంగా కాంగ్రెస్ సభ్యులు
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికాలో నెలకొన్న సుధీర్ఘ షట్‌డౌన్(Prolonged shutdown) ముగియడానికి రోజులు దగ్గర పడ్డాయి. దీంతో అమెరికా దేశ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump), కాంగ్రెస్ సభ్యులు కళ్లు తెరవడంతో 40 రోజుల పాటు సాగిన షట్‌డౌన్‌కు తెరపడినట్టే.
అమెరికా కాలమానం ప్రకారం అక్టోబర్ 1 న షట్‌డౌన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ షట్‌డౌన్ కారణంగా ఎనిమిది వారాల పాటు షట్‌డౌన్ కొనసాగితే 14 బిలియన్ డాలర్ల నష్టం ఎదుర్కొనే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక నిపుణులు అంచనా వేశారు.
దీని ప్రభావంతో మూడు రోజులుగా చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం నవంబర్ పదవ తారీకున ఒక్కరోజు 2700 విమాన సర్వీసులు రద్దు కావడంతో పాటు మరో పది వేల విమాన సర్వీసులు(airlines) ఆలస్యంగా నడవడం వల్ల దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం కలగడంతో ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి సెనెటర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షట్‌డౌన్ ముగించే దిశగా తొలి అడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్లు ప్రతిపాదించిన ఓ డీల్ కు కొందరు డెమోక్రాట్లు సానుకూలంగా స్పందించారు.
చివరి నిమిషంలో టెక్సాస్ సెనెటర్ జాన్ కార్నిన్(Texas Senator John Cornyn) ఓటుతో తీర్మానానికి అనుకూలంగా 60 ఓట్లు వచ్చాయి. సెనెట్ రిపబ్లికన్ సభ్యుల సంఖ్య 53 కాగా, డెమోక్రాట్ల సంఖ్య 45, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. అక్కడ బిల్లు ఆమోదం పొందాలంటే 60 ఓట్లు రావాలి. అలాగే ఎనిమిది మంది డెమోక్రాట్లు మద్దతు ఇవ్వడంతో బిల్లు పాస్ అయింది. దీంతో ఒకటి, రెండు రోజుల్లో షట్‌డౌన్ ముగియనున్నది.
అసలు కథ ఇక్కడ ప్రారంభమైంది…
సేనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు ఆమోదం దక్కక పోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 30, అర్ధరాత్రి (11:59 నిమిషాలు) వరకు ఆ బిల్లు క్లియరెన్స్ కోసం ఎదురు చూశారు. కానీ డెమోక్రాట్లు తగ్గక పోవడంతో ట్రంప్ సర్కారు షట్‌డౌన్ ప్రకటించింది. సేనేట్‌లో రిపబ్లికన్లకు కంట్రోల్(Control) ఉన్నాఈ బిల్లును పాస్ చేయించుకోలేక పోయారు. ఫండింగ్ బిల్లు సేనేట్‌లో పాస్ కాకపోవడం వల్ల అక్టోబర్ ఒకటో తేదీన నిరవధికంగా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు వైట్‌హౌజ్ వెల్లడించిన సంగతి విదితమే.
గడిచిన ఏడేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. 1981 నుంచి అక్కడి ప్రభుత్వం 15 సార్లు షట్‌డౌన్ ప్రకటించింది. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు షట్‌డౌన్ కాగా, అప్పటికి అదే సుదీర్ఘ షట్ డౌన్ అయింది. అప్పుడు కూడా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. డోనాల్డ్ ట్రంప్ హయాంలో ఇది మూడోసారి.
శాంతించిన డెమాక్రాట్లు
అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువ కాలం షట్‌డౌన్ కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్ 31న కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్(Congressional Budget Office) విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం.. ఈ షట్‌డౌన్ కారణంగా ఇప్పటికే ఏడు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఇలాగే కొనసాగితే ఆర్థిక నష్టం మరింత పెరుగుతుంది. షట్‌డౌన్ ఆరు వారాలు కొనసాగితే నష్టం 11 బిలియన్ డాలర్లకు, 8 వారాలు కొనసాగితే 14 బిలియన్ డాలర్లకు చేరుకునే ప్రమాదం ఉంది.
మరోవైపు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ దుర్బలంగా ఉందని, ప్రభుత్వ షట్‌డౌన్ ప్రజలు అనుకున్న దానికంటే చాలా వేగంగా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత త్వరగా షట్‌డౌన్ ముగిస్తే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం కావడంతో చాలా ఫెడరల్ ఏజెన్సీలకు(Federal Agencies) జనవరి వరకు నిధులు అందుతాయి. షట్‌డౌన్ కారణంగా ప్రభావితమైన ఫెడరల్ ఉద్యోగులందరికీ బకాయిపడ్డ జీతాలను చెల్లించేందుకు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి

