Stampede | బెంగళూరు తొక్కిసలాటకు ఆర్సీబీదే బాధ్యత… క్యాట్ నివేదికలో ఘాటు వ్యాఖ్యలు

బెంగళూరు : బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జూన్ 4న జరిగిన స్టాంపీడ్ ఘటనపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ 2025 విజయం అనంతరం నిర్వహించిన వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 30 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, CAT తన తీర్పులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ను ఈ ఘటనకు ప్రాథమిక బాధ్యుడిగా పేర్కొంది.

CAT నివేదిక ప్రకారం, RCB – కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండానే, సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకల విషయాన్ని ఆకస్మికంగా ప్రకటించాయి. ఈ ప్రకటన వెలువడిన కేవలం 12 గంటల వ్యవధిలోనే 3 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు స్టేడియానికి తరలివచ్చారు. ఈ అతిపెద్ద జనం గుమికూడడాన్ని నియంత్రించేందుకు పోలీసులకు సరైన సమయం లేకపోవడంతో ఈ ఘోరమైన ఘటన చోటుచేసుకుంది.

ట్రిబ్యునల్ తన తీర్పులో ఘాటుగా స్పందించింది – “పోలీసులు దేవుళ్లు కాదు, మాంత్రికులు కూడా కాదు. ఇంత పెద్ద సమావేశాన్ని ముందస్తు ఏర్పాట్లు లేకుండా నిర్వహించడం అత్యంత నిర్లక్ష్యపూరిత చర్య” అని పేర్కొంది. పోలీసులు తప్పు చేసినట్టుగా భావించి విధించిన సస్పెన్షన్లను తిప్పికొట్టింది, అలాగే సంబంధిత పోలీస్ అధికారుల విధుల్లోనే ఉన్నట్టుగా పరిగణించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం RCB – KSCA అధికారులు, ఈవెంట్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. పలువురిపై అరెస్టు వారంట్లు కూడా జారీ అయ్యాయి.

Leave a Reply