హైదరాబాద్ : యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ (Universal Srishti Fertility Center) పై కీల‌క విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సరోగసీ, చైల్డ్ ట్రాఫికింగ్, తప్పుడు డీఎన్ఏ నివేదికలు, నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు వంటి అనేక అంశాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ఈ ఘటనపై వివరాలు వెల్లడిస్తూ, ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ అట్లూరి నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణ, ఇతరులు కలిపి మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

2024లో సంతానం కోరికతో దంపతులు.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను సంప్రదించారు. డాక్టర్ నమ్రత IVF (టెస్ట్ ట్యూబ్ బేబీ) చేయడం సాధ్యపడదని చెబుతూ, సరోగసీ విధానాన్ని సూచించారు. దాంతో, దంపతులు దాదాపు రూ.35 లక్షలకుపైగా డబ్బు చెల్లించారు. 2025 జూన్‌లో విశాఖపట్నంలో ఓ బాబు పుట్టినట్టు చెప్పి, ఆ బిడ్డను సరోగసీ తల్లిద్వారా జన్మించినట్లుగా నమ్మించారు.

కానీ కొన్ని అనుమానాలు రావడంతో ఆ దంపతులు డీఎన్ఏ టెస్టు చేయించగా, ఆ శిశువు వారి బిడ్డ కాదని తేలింది. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. అసోం కు చెందిన ఓ మహిళకు జన్మించిన బిడ్డను రూ.90,000కి కొనుగోలు చేసి, దంపతులకు అందించి సరోగసీ పేరుతో మోసం చేశారు. డాక్టర్ నమ్రత నకిలీ జనన ధ్రువీకరణ పత్రం, తప్పుడు డీఎన్ఏ నివేదిక తయారు చేసి వారి సంతానంగా నమ్మించేందుకు ప్రయత్నించారు.

ఈ మోసం వెలుగులోకి రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా, విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు సరైన అనుమతులు లేవని. 2021లోనే హాస్పిటల్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. అయినా మరో డాక్టర్ పేరు ఉపయోగించి అక్రమంగా కొనసాగిస్తున్నారు.

అధికారుల దర్యాప్తులో మరోక కీలక విషయం కూడా బయటపడింది. ఈ కేంద్రంలో IVF చికిత్సలు అధికారిక అనుమతుల్లేకుండా జరుగుతున్నాయి. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ లేకుండా డాక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిసింది. అంతేకాకుండా, సరోగసీ పేరుతో పిల్లల కొనుగోలు, అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితులు ఫిర్యాదు చేయగా బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం.

ఈ కేసులో అరెస్టయిన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి:

  • డా. అట్లూరి నమ్రత (64): ఫెర్టిలిటీ సెంటర్ యజమాని
  • పచ్చిపాల జయంత్ కృష్ణ (25): ఆమె కుమారుడు
  • సి. కళ్యాణి అచ్చయ్యమ్మ (40): సెంటర్ మేనేజర్
  • గొల్లమండల చెన్నరావు (37): ల్యాబ్ టెక్నీషియన్
  • నార్గుల సదానందం (41): అనస్థీషియా డాక్టర్
  • ధనశ్రీ సంతోషి (38), మహమ్మద్ అలీ (38), నస్రీన్ బేగం (25): అసోం నివాసులు
    ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

ప్రస్తుతం పోలీసులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను సీజ్ చేశారు. పెద్ద మొత్తంలో నకిలీ పరికరాలు, అనధికార చికిత్స పద్ధతులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసులు కోర్టులో కొనసాగుతున్నాయని, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందని డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు.

Leave a Reply