Srushti case | ముగిసిన తొలిరోజు విచారణ !

హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు సంబంధించిన చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ మోసాల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతపై పోలీసుల విచారణ పూర్తయింది. జోన్ డీసీపీ కార్యాలయంలో ఆమెను పోలీసులు సుమారు ఐదు గంటలకు పైగా విచారించారు.

గోపాలపురం పోలీసులు ఆమెను విచారిస్తూ చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ మోసాలు, ఐవీఎఫ్ ప్రక్రియల దుర్వినియోగం వంటి కీలక అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణలో ఆమె చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్టుగా అంగీకరించినట్టు సమాచారం. ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరోగసీ వైపు మళ్లించిన దానిపై ఆమె సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న డాక్టర్ నమ్రతను ఇవాళ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెపై హ్యూమన్ ట్రాఫికింగ్, శిశువుల విక్రయం, ఇతరుల స్పెర్మ్‌ను వాడి పిల్లలు పుట్టించేలా చేయడం వంటి సంచలన ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ ప్రారంభమైంది.

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిందని చెబుతున్న ఈ అక్రమాలు, పిల్లల కోసం వచ్చిన అమాయకుల నమ్మకాన్ని వాణిజ్యంగా మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు ఐదు రోజులపాటు ఆమెను విచారించనున్నారు. పూర్తి విచారణ జరిగితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply