Srisailam | దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని..

Srisailam | దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని..
Srisailam | ఆరుద్రా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు
దేశ శాంతి, సౌభాగ్యాల కోసం సంకల్పం
వేదమంత్రాల మధ్య ఘనంగా రథోత్సవం
జానపద కళారూపాలతో భక్తుల సందడి
Srisailam | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించబడిందని దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు, కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు లు పేర్కొన్నారు. ఆరుద్రోత్సవంలో భాగంగా శుక్రవారం వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయన్నారు.

అనంతరం స్వర్ణరథోత్సవం జరిపించబడిందన్నారు. ఈ స్వర్ణరథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని ప్రత్యేక పూజలు చేపట్టా రు.దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయన్నారు.

అనంతరం భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఉదయం గం.7.30లకు ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైందన్నారు. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించడం జరిగిందన్నారు.సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, తప్పెట చిందులు, మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయన్నారు. అదేవిధంగా రథోత్సవంలో సంప్రదాయ నృత్యం, ఏర్పాటు చేయబడిందన్నారు . ఈనాటి స్వర్ణరథోత్సవంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, హిందూధర్మపరిరక్షణ ట్రస్ట్ ఛైర్మెన్ డా. దాసరి శ్రీనివాసులు, అర్చకస్వాములు, పలువిభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
