ఘనంగా కార్తీక మాసోత్సవాలు షురూ

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక మహోత్సవాల్లో భాగంగా సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు వేకువజాము నుండే అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారని దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్య స్నానాలాచరించుకుని శ్రీస్వామిఅమ్మ వార్ల దర్శనార్థమై ఆలయానికి చేరుకుంటున్నారని, దర్శనం ఏర్పాట్లు చేశామన్నారు. కార్తీకమాసంలో ప్రభుత్వ సెలవుదినాలు, కార్తీక సోమవారాలు మరియు కార్తీకపౌర్ణమి రోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకోవడం జరుగుతోందన్నారు. భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

తదితర వివరాలు
- భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనంకు ఏర్పాట్లు..
- వేకువజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాలసేవలను జరిపించిన అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంత్రం 4 గంట ల వరకు దర్శనాలను కొనసాగించాలన్నారు. అదేవిధంగా తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి రాత్రి గం. 10.30ల వరకు దర్శనాలు కొనసాగుతాయన్నారు.
- అదేవిధంగా కార్తీకమాస రద్దీరోజులలో అనగా శని, ఆది, సోమవారాలు శుద్ధఏకాదశి, కార్తీక పూర్ణిమ మొదలైన రోజులు కార్తీకమాసములో మొత్తం 16 రోజులు స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేయబడిందన్నారు. ఈ రద్దీరోజులలో సామూహిక ఆర్జిత అభిషేకాలను కూడా నిలుపుదల చేయడం జరిగినదన్నారు.

సిబ్బందికి ప్రత్యేక విధులు.. బాధ్యతలు..
- శ్రీశైలం కు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకై దేవస్థానం శాఖాధిపతులకు, పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించబడ్డాయrన్నారు. దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వర్తిస్తున్నారన్నారు.
- కార్తీకమాసమంతా క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే భక్తులకు అల్పాహారం మరియు మంచినీరు అందజేయబడుతున్నాయన్నారు. ఈ ఉదయం నుంచే భక్తులకు వేడిపాలను కూడా అందజేయడం జరిగిందన్నారు.
- కార్తీక మాసం సందర్భంగా వచ్చిన భక్తులు కార్తికదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధి మరియు గంగాధరమండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
- భక్తులకు అన్నదాన భవనములో ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ చేయబడుతున్నాయన్నారు. సాయంత్రం 6.30 గంటల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయబడుతుందన్నారు. కార్తీకమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేయబడ్డాయన్నారు. మొత్తం 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందజేయబడుతున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు.
