Sridhar Babu | ఫ్రీ బస్ పై బీఆర్ఎస్ గగ్గోలు

Sridhar Babu | ఫ్రీ బస్ పై బీఆర్ఎస్ గగ్గోలు
జూబ్లీహిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పారు
ప్రతి ఆడపడుచుకు చీరే సారే
మరో 8 ఏళ్లు అధికారం మాదే
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
Sridhar Babu | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) తెలియజేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో మహిళలకు చీరలు, స్వశక్తి సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ… 2023 ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free bus travel) అమలు చేసిందన్నారు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతూ పిచ్చిపిచ్చి ప్రకటనలు చేశారని, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళలు వారికి కర్రు కాల్చి వాత పెట్టాన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని, మరో 8ఏళ్ల పాటు అధికారం కాంగ్రెస్ పార్టీదే అన్నారు.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు..
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను (Welfare schemes) ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమది అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా నిరుపేదలకు సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం స్వశక్తి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించడం మరిచిపోయిందన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్డీ లేని రుణాలను అందిస్తూ మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మహిళ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పాలసీ అమలు చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి రామగుండం శాసనసభ్యులు విజయ రమణారావు, మక్కాన్సింగ్ తోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
