శ్రీ నాగులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ములుగు జిల్లా, మంగపేట, నవంబర్ 5 ( ఆంధ్రప్రభ) : కార్తీక పౌర్ణమి సందర్భంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీ నర్సాపురం గ్రామంలోని శ్రీ నాగులమ్మ ఆలయం (Sri Nagulamma Temple) బుధవారం భక్త జనంతో కిక్కిరిసిపోయింది. కార్తీక పౌర్ణమిని పురష్కరించుకుని బుధవారం ఉదయం భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి నాగులమ్మ ఆలయానికి చేరుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగులమ్మ పుట్ట వద్ద పాలు పోసి పూలు ఫలాలతో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న నవ నాగులకు, కంక వనం పుట్టకు భక్తులు పూజలు (Devotees worship) నిర్వహించారు. శ్రీనాగలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని దీపాలు వెలిగించారు. శ్రీ నాగులమ్మ ఆలయానికి సమీప గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ , ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ (దేవర బాల), ఆలయ పూజారి బాడిశ నాగ రమేష్, బాడిశ నవీన్ తదితరుల ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.

