Special meeting | ఇచ్చిన వాగ్దానాలు అమలు చెయ్యరా?..

Special meeting | ఇచ్చిన వాగ్దానాలు అమలు చెయ్యరా?..
- ఈ నెల 13వ తేది కలెక్టరేట్ వద్ద అమలు సాధనకై పోరాటం…
- రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు..
Special meeting | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల కోసం ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చక పోవటం చాలా దారుణమని వాటి అమలుకై ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పోరాటమే శరణ్యంగా భావిస్తున్నామని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. ఎస్ టీ యు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల సాధనకు ఇచ్చిన పోరాటంలో భాగంగా రెండవ దశ పోరాటం ఫిబ్రవరి 13న నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.చంద్ర శేఖర, యం.అజాం బేగ్ పిలుపునిచ్చారు.
బుధవారం కార్యాలయంలో వారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒకవైపు… ప్రస్తుత ప్రభుత్వం పెడచెవిన ధోరణి మరొకవైపు ఏది ఏమైనా ఉపాధ్యాయ-ఉద్యోగుల, పెన్షనర్ల స్థితిగతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉద్యోగులకు పిఆర్సి కమిటీ నియమించి, మెరుగైన పిఆర్సి ఫలాలు ఇస్తామని, ఉద్యోగుల-పెన్షనర్ల పాత బకాయిలన్నీ చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు. సిపిఎస్ ఉద్యోగుల సమస్య తీరుస్తామన్నారు. గద్దెనెక్కిన నూతన ప్రభుత్వం ఏర్పడి రమారమి 20 నెలల కాలంలో ఇచ్చినది రవ్వంత ఇవ్వవలసింది కొండంత అన్నట్లు తయారై ఉందని విమర్శించారు. దాదాపు ఇప్పటికీ 34 వెల కోట్లరూపాయలు పైచిలుకు బకాయిలు ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సి ఉన్నదన్నారు.
