బెంగళూరు – అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా రెండో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. PSLV-C60/SpaDeX మిషన్‌లో భాగంగా రెండో డాకింగ్ ప్రక్రియ సోమవారం పూర్తయిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ లో పేర్కొన్నారు.
ఉపగ్రహాల రెండో డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. PSLV-C60/SpaDeX మిషన్‌ను గత ఏడాది డిసెంబర్ 30న ప్రయోగించాం. ఆ తర్వాత తొలిసారిగా శాటిలైట్లను ఈ ఏడాది జనవరి 16న విజయవంతంగా అనుసంధానించాం. అదేవిధంగా మార్చి 13న వాటిని అన్‌డాకింగ్ చేశాం. రాబోయే రెండు వారాల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నాం అని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ మిషన్ లో పాల్గొన్న ఇస్రో సిబ్బందిని ఆయన అభినందించారు.
తన స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా స్పేస్ డీ-డాకింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో మార్చి 13న వెల్లడించిన విషయం తెలిసిందే. అంతరిక్ష నౌకలు సొంతంగా డాక్ అయ్యేలా చేయడంలో ఇదో ముఖ్యమైన అడుగు. భూఉపరితం నుంచి నావిగేషన్‌పై ఆధారపడకుండా.. చంద్రయాన్-4 లాంటి భవిష్యత్ ప్రయోగాలకు ఇది ఎంతో కీలకం. మానవ సహిత అంతరిక్ష యాత్రలే లక్ష్యంగా ముందుకుసాగుతున్న ఇస్రోకు ఈ సాంకేతికత ఎంతో అవసరం
అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానించే మిషన్‌ను ఇస్రో చేపట్టింది. ఇందులోభాగంగా గతేడాది డిసెంబర్ 30న ఛేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించింది. పలు ప్రయత్నాల అనంతరం చివరకు జనవరి 16న డాకింగ్ ప్రక్రియ (SpaDeX) విజయవంతంగా చేపట్టింది. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.