SP Akhil Mahajan | గంజాయి రహిత జిల్లాగా రూపుదిద్దాం
- నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో 4 సీసీ కెమెరాలు..!
- పాఠశాల విద్యార్థులకు అండగా “ఖాకీ కిడ్స్”…!
- తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. పెరిగిన దొంగతనాలు..
- ఆదిలాబాద్ జిల్లా వార్షిక క్రైమ్ రిపోర్ట్ విడుదల…
SP Akhil Mahajan | ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు చేపట్టిన సంస్కరణలతో ఆశించిన ఫలితాలు సాధించామని ఎస్పీ అఖిల్ మహాజన్ (Akhil Mahajan) అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా వార్షిక క్రైమ్ రిపోర్ట్ ను విడుదల చేశారు. యువత గంజాయి, మాదకద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారని, కొత్త సంవత్సరంలో గంజాయి రహిత జిల్లాగా రూపుదిద్దామని ఎస్పీ స్పష్టం చేశారు. పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులచే (Students) యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి పకడ్బందీగా పర్యవేక్షిస్తామన్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఆదివాసుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, వారి పిల్లల అక్షరాస్యతను పెంపొందించేలా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ రూపొందించిందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విడీసీ పేరుతో చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న కమిటీలను సమూలంగా నియంత్రించి వారిపై కేసులు కూడా నమోదు చేశామన్నారు.

నేరాలు పెరిగినా… రోడ్డు ప్రమాదాలు తగ్గాయి..!
2025 సంవత్సరంలో సైబర్ క్రైమ్ రేట్ తో పాటు శాంతి భద్రతల విషయంలో నేరాలు పెరిగినప్పటికీ, దొంగతనాల కేసుల్లో 48 శాతం రికవరీ సాధించామన్నారు. గత సంవత్సరం 129 రోడ్డు ప్రమాదాలు దొరికితే ఈసారి 109 ప్రమాదాలు సంభవించాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ శాఖ సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టం చేశారు. మెసేజ్ యువర్ ఎస్పి, ఆపరేషన్ చబుత్ర, ఆపరేషన్ జ్వాలా, పోలీసు అక్క, అభయ మై టాక్సీ తదితర వినూత్న కార్యక్రమాలతో పోలీసులు (Police) ప్రజలకు చేరువవుతున్నారని ఎస్పీ అన్నారు. పాఠశాల విద్యార్థులకు అండగా “ఖాకి కిడ్స్” కార్యక్రమం 2026లో అమలు చేస్తున్నట్టు తెలిపారు. నూతన సంవత్సరానికి పురస్కరించుకొని రోడ్లపై యువత ఫూటుగా తాగి, న్యూసెస్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని, రోడ్లపై ఎక్కడికక్కడ ఏఆర్ పోలీస్ జలాలను రంగంలోకి దించుతున్నట్టు ఎస్పీ తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన 127 మందిపై రౌండ్ షీట్లు తెరిచినట్లు తెలిపారు. ఏడాది రికార్డు స్థాయిలో 717 మొబైల్ ఫోన్లను (Mobile Phone) రికవరీ చేశామని, సైబర్ క్రైమ్ నియంత్రణకు పకడ్బందీ ప్రణాళిక అమలు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ పి మౌనిక, ట్రైనీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.గంజాయి రహిత జిల్లాగా రూపుదిద్దాం

