సామాజిక మార్పు దిశగా జ్యోతిరావు ఫూలే ఆలోచనలు…

సామాజిక మార్పు దిశగా జ్యోతిరావు ఫూలే ఆలోచనలు…
ఇటుకాలపల్లి గ్రామంలో ఘనంగా జయంతి వేడుకలు…
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ శ్రీమతి శ్రీ మెరుగు సుమలత శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావుఫూలే చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుమలత శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు ఫూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఫూలే చూపించిన మార్గంలో నడిస్తే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.
ఈ జయంతి వేడుకలో ఉప సర్పంచ్ యండి ఆఫ్జల్ పాషా, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని ఫూలే సేవలను స్మరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరూ ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇలాంటి మహానుభావుల జయంతులను ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించడం ద్వారా కొత్త తరానికి వారి గొప్పతనాన్ని తెలియజేయాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు సమాజంలో చైతన్యం కలిగించే కార్యక్రమాలకు ముందుండాలని పిలుపునిచ్చారు. గ్రామంలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలు సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచాయి. ప్రజలలో సమానత్వ భావనను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.
