కనుమరుగవుతున్న గ్రామీణ వీధి నాటకాలు..

కనుమరుగవుతున్న గ్రామీణ వీధి నాటకాలు..

అంతరించిపోతున్న కథలు బుర్రకథలు
నాడు ఊరుల తిరుగుతూ ప్రదర్శనలు
సినిమాలు టీవీల్లో సెల్ఫోన్ గుప్పిట్లో పల్లె ప్రజలు
ఆదరణ కోల్పోతున్న కళాకారులు

టేకుమట్ల, ఆంధ్రప్రభ : బుర్రకథలు, భజనలు, చిరుతల రామాయణం, కోలాటాలు, జడకొప్పు, హరికథలు, జానపద గేయాలు, వీధి నాటకాలు, భాగవతాల ప్రదర్శనలతో ఒకనాడు పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేది. పొలాల్లో నాట్లు వేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు పాడే పాటలు హృదయాలను పులకింపజేసేవి. పగలంతా కష్టపడే శ్రమజీవులు ..సాయంత్రం వేళ ఈ కళలతో సేదతీరేవారు. చిన్నా, పెద్దా అంతా ఒకచోట చేరి ఆసక్తిగా తిలకించేవారు. కాలక్రమేణా పల్లె ప్రజల జీవనశైలి మారింది. నాటి కళలు జాడలేకుండా పోయాయి. నిఖార్సెన పల్లె పదాలు ఉనికిని కోల్పోతున్నాయి.

ఒకప్పుడు ఊరి మధ్యలో రచ్చబండ దగ్గర యువకులు, పెద్ద మనుషులు అంతా చేరి ముచ్చట్లు పెట్టుకుని కాలక్షేపం చేసేవారు. ఇక, వినాయక నవరాత్రుల్లో అయితే మండపాల వద్ద భక్తిగేయాలు, భజనలు, భాగవతాలు, రామాయణ కథలను వినిపించేవారు. నేటి ఆధునిక ప్రపంచంలో సినిమాలు, టీవీలు, సెల్ఫోన్లు గ్రామాలను కమ్మేశాయి. ఖాళీ సమయం దొరికిందంటే చాలు సోషల్ మీడియాలో దూరిపోతున్నారు. దీంతో, ఈ వృత్తిని నమ్ముకున్న కళాకారులు వేరే రంగాల్లోకి వెళ్లిపోయి మేస్త్రీలు, కూలీలుగా మారారు.

చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు నేటి తరానికి కథలు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నదని, తాత ముత్తాతల నాటి కళా వారసత్వాన్ని వారికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో చిందు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరు గ్రామాల్లో డబ్బుల కోసం ఒప్పందం కుదుర్చుకొని నాటకాలు (భాగవతం) ఆడుతారు. వారు పెట్టిన అన్నం, బట్టలు స్వీకరిస్తారు.

ఆకట్టుకున్న వీధి భాగవతాలు….

సొంత గ్రామాన్ని వదిలి పెట్టి వెళ్లి సుమారు పదేండ్ల వరకు తిరిగి ఇంటి ముఖం చూసేవారు కాదు. వీరు వచ్చారంటేనే ఆయా గ్రామాల ప్రజలు ఎంతో సంతోషపడేవారు. చిన్నారులు, పెద్దలు నాటకం మొదలవ్వడానికి గంటల ముందే బొంతలు (గోనె సంచులు) ఈత కమ్మలతో అల్లిన సాపలను వేసి ముందే స్థలాన్ని ఆపుకొనే వారు. చిందు కళాకారులు తమ కళా నైపుణ్యంతో ఈల (సీటీ)ల మధ్య, తెలంగాణ సాంస్కృతిక, భాషాపరమైన పదాలతో బుడ్డర కాన్(జోకర్) మాట్లాడే జోకులతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేవారు

జీవన విధానం…

చిందు కళాకారులకు వ్యవసాయ భూములు అంతగా లేకపోవడంతో ఆయా గ్రామాల్లో వీధి భాగోతాలను ఆడుతూ జీవితాలను గడిపేవారు. రామాయణం, మైరావణ, జాంబవంతుడి జీవిత చరిత్ర, బాలనాగమ్మ, బ్రహ్మంగారి చరిత్రతో పాటు మరి ఎన్నో నాటకాలు వేసేవారు. చదువు రాకున్నా తమకున్న పరిజ్ఞానంతో వారే దర్శకులుగా, సంగీతం, కొరియోగ్రఫీ చేసుకొని హాస్యంతో పాటు ఇతర పాత్రలకు జీవం పోసి ప్రజలను అలరింపజేసేవారు. పగటి వేళలో ప్రదర్శనలు నిర్వహించిన తర్వాత ప్రతి ఇల్లూ తిరుగుతూ అన్నం (బువ్వ), కూరలను సేకరించుకుని భోజనం చేసేవారు. ఆ గ్రామంలో కార్యక్రమాలు అయిపోయాక డబ్బులు తీసుకొని ఇతర గ్రామాలకు వెళ్లేవారు

కనుమరుగవుతున్నచిందు భాగవతాలు—–(సాంబశివరావు రామకృష్ణాపూర్)

నేడు ప్రతి ఇంటిలో టీవీ, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ తప్పనిసరిగా మారింది. దీంతో నాటి జానపద కళలపై ప్రజలకు ఆసక్తి తగ్గిపోయింది. మారుమూల గ్రామాల్లో సైతం వీధి భాగవతాలను చూసేందుకు ఇష్టపడటం లేదు. దీంతో నాడు ఒక్కో గ్రామంలో నెలల తరబడి ప్రదర్శనలు చేసిన చిందు కళాకారులు, నేడు మాత్రం కొన్ని రోజులు మాత్రమే కార్యక్రమాలను నిర్వహించి వెళ్లిపోతున్నారు

Leave a Reply