దేశానికే ఆదర్శనీయం.. నీతీ ఆయోగ్ జాయింట్ సెక్రెటరీ సిద్దార్థ్ జైన్

దేశానికే ఆదర్శనీయం.. నీతీ ఆయోగ్ జాయింట్ సెక్రెటరీ సిద్దార్థ్ జైన్

కడప, ఆంధ్రప్రభ బ్యూరో : సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ నిర్వహణ అద్భుతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం మరింత బాగుందని దేశానికే ఆదర్శవంతంగా ఉన్నాయని.. నీతీ ఆయోగ్ జాయింట్ సెక్రెటరీ సిద్దార్థ్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పర్యటన లో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తోకలిసి రాష్ట్రానికే ఆదర్శవంతంగా నిర్మించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సి.కె.దిన్నె జెడ్పీ హైస్కూలులోని సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ను నీతి ఆయోగ్ జాయింట్ సెక్రెటరీ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచనతో పైలెట్ ప్రాజెక్టుగా అమలులోకి తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్వహణ గురించి ప్రాబరీ అధికారికి వివరిస్తూదేశంలోనే తొలిసారిగా సికె దిన్నె ఎంపిపి పాఠశాల ఆవరణ లో రూ.56 లక్షల తో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ద్వారా..ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాల్లోని 33 పాఠశాలల్లోని 1758 మంది విద్యార్థులకు శుచికరమైన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందివ్వడం జరుగుతుందన్నారు.

డిసెంబర్ చివరి నాటికల్లా కడప జిల్లాలోని 11 మండలాల్లో 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు రుచి, శుచికరమైన ఆహారాన్ని అందిస్తామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం సికే దిన్నె 2, జమ్మలమడుగు 2, కడపలో 1 స్మార్ట్ కిచెన్ ల ద్వారా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద 136 పాఠశాలలకు చెందిన 10,332 మంది విద్యార్థులకు 13 ప్రత్యేక వాహనాల్లో ఆహారాన్ని పంపేలా చర్యలు చేపడుతున్నామన్నారు. న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో సోలార్ పవర్ తో పనిచేసే ఈ స్మార్ట్ కిచెన్ లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు. మెరుగైన నాణ్యత కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంటు నీటినే వంటకు ఉపయోగించడం జరుగుతోందన్నారు.

ఈ సందర్భంగా స్మార్ట్ కిచెన్ ను సందర్శించిన నీతి ఆయోగ్ జాయింట్ సెక్రెటరీ వంటకు సంబంధించిన అన్ని ప్రక్రియలను,సరుకుల నాణ్యత, భోజనం తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్ఓ ప్లాంటు, ఆహార పంపిణీ వాహనాలను కూడా ప్రాబరీ అధికారి సిద్ధార్థ జైన్ క్షుణ్ణంగా పరిశీలించారు.

వంట నిర్వాహకులను పలకరించగా.. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం శుచి, రుచితో కూడిన భోజనాన్ని నిర్ణీత సమయానికి తాము అందించ గలుగుతున్నామని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా సులభంగా.. వంటను పూర్తి చేయగలుగుతున్నామని వంట సిబ్బంది తెలపడంతో… జాయింట్ సెక్రెటరీ సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని.. సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో జిల్లా యంత్రాంగం, సంబందిత అధికారుల సేవలు ప్రశంసనీయమని జాయింట్ సెక్రెటరీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిపి నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్, విద్యాశాఖ ఆర్జెడి శామ్యూల్, డీఈవో శంశుద్దిన్, హౌసింగ్ పీడి రాజరత్నం,సమగ్ర శిక్ష ఏపీసి ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply