మహబూబాబాద్, నర్సింహులపేట, మార్చి17(ఆంధ్రప్రభ) : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నర్సింహులపేట మండల కేంద్రంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిసాయి.
ఈనెల 12 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు అర్చకులు పరిసమాప్తి పలికారు. కార్యనిర్వాహణాధికారి కే.వేణుగోపాల్ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు నందనాచార్యులు, రాంబాబుచార్యుల ఆధ్వర్యంలో పూర్ణాహుతి ధ్వజపట ఉద్వాసన, చక్రతీర్థం, మధ్యాహ్నం 12 గంటలకు దేవతోద్వాసన, శ్రీ పుష్ప యాగం, ఏకాంత సేవలు ఉత్సవ పరిసమాప్తి నిర్వహించారు. పుష్పయాగంలో రకరకాల పూలతో స్వామి వారిని అలంకరించారు. ఈకార్యక్రమంలో ఖమ్మం పట్టణానికి చెందిన దాతలు తల్లాడ ఉషారాణి రమేష్ లు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ మార్క శేఖర్, సిబ్బంది సాయి, రాములు, తదితరులు పాల్గొన్నారు.