సాంకేతిక కమిటీ సూచన మేరకు తాత్కాలిక బ్రేక్
ఫిబ్రవరి 22న దుర్ఘటన
ప్రమాదంలో చిక్కుకుంది ఎనిమిది మంది
ఇద్దరి మృతదేహాలు లభ్యం
లభించని ఆరుగురి ఆచూకీ
ఆమ్రాబాద్, ఆంధ్రప్రభ : ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్‌ను శనివారం నిలిపి వేశారు. ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగి ఎనిమిది మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన నాటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటి వరకు 63 రోజులుగా అవిశ్రాంతంగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌కు శనివారం నుంచి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది, మిగిలిన ఆరుగురి ఆచూకీ కోసం ఆపరేషన్ కొనసాగించారు. అయితే ఇంత వరకు ఆరుగురి ఆచూకీ లభ్యం కాలేదు. టన్నెల్‌లో నిరంతరం పనిచేసిన ఎక్స్‌కవేటర్లు గురువారం బయటకు వచ్చాయి. శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినప్పటికీ, ప్రమాదకరమైన జోన్‌లో మాత్రం ఇంకా తొలగించాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు, సహాయక చర్యలను మూడు నెలల పాటు నిలిపివేశారు.
సాంకేతిక కమిటీ నిర్ణయం
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలను నిలిపివేయాలని సాంకేతిక కమిటీ నిర్ణయానికి వచ్చింది. టన్నెల్ ఇన్లెట్ వైపు నుండి 13.6 కిలోమీటర్ల తర్వాత ముందుకు వెళ్లడం సురక్షితం కాదని కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు, గురువారం జలసౌధలో రెవెన్యూ శాఖ (విపత్తులు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధ్యక్షతన సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఏపీలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్, నేషనల్ జియోఫిజికల్ పరిశోధనా సంస్థ డైరెక్టర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూశాస్త్రవేత్త , బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) నుండి టన్నెల్ నిపుణులు పరీక్షిత్ మెహ్రా పాల్గొన్నారు. వారి సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు