Singareni | సింగరేణి కార్మికుల భద్రతే లక్ష్యం : ఎంపీ…
- గోదావరిఖని–11 ఇన్‌క్లైన్ గనిలో ఎంపీ పర్యటన
- విశ్రాంతి కార్మికులకు రూ.10వేల పెన్షన్ కోసం ప్రయత్నం
Singareni | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రామగుండం సింగరేణి(Singareni) ఏరియా గోదావరిఖని–11 ఇన్‌క్లైన్ బొగ్గు గనిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి డ్రెస్‌కోడ్‌లో ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా అర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌తో పాటు సింగరేణి అధికారులు ఎంపీకి ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.
ఎంపీ వంశీకృష్ణ గనిలోకి (అండర్‌గ్రౌండ్) వెళ్లి పనిస్థలాలను సమీక్షించారు. అనంతరం గని ఆవరణలోని దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే కార్మికుల(workers)ను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సింగరేణిలో నెలకొన్న పలు సమస్యలను కార్మికులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు.


సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు, మెడికల్ బోర్డు ఏర్పాటు అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించినట్లు ఎంపీ తెలిపారు. ఈ అంశాలను మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అలాగే విశ్రాంతి సింగరేణి కార్మికులకు నెలకు రూ.10,000 పెన్షన్(Rs. 10,000 pension) వచ్చేలా పార్లమెంటులో ప్రస్తావించానని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దృష్టికీ తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
పార్లమెంటులో అవకాశం వచ్చిన ప్రతిసారి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడతానని, కార్మికుల సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు. మారుపేరుల సమస్య(problem) పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

ముఖ్యంగా మహిళా కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సింగరేణి కార్మికుల రక్షణే ధ్యేయంగా సేఫ్టీ, సెక్యూరిటీ(security) చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అధికారులకు ఎంపీ సూచించారు.

CLICK HERE TO READ MORE : Kalvakuntla Kavitha | కంటతడి పెట్టిన కవిత…

