Singareni |కీలక ఖనిజాల ఉత్పత్తిలో క్వీన్స్ లాండ్ సహకారం – ఉప ముఖ్యమంత్రి భట్టి

హైదరాబాద్ – భారతదేశంలో కీలక ఖనిజాల మైనింగ్ లో తెలంగాణ రాష్ట్రం ప్రధాన భూమిక పోషించనుందని, ఈ నేపథ్యంలో క్వీన్స్ లాండ్ (ఆస్ట్రేలియా) ప్రభుత్వంతో కీలక ఖనిజాల టెక్నాలజీ, మైనింగ్ రంగంలో పరస్పర సహకారం, భాగస్వామ్యానికి ముందడుగు వేయడం గొప్ప శుభ పరిణామమని, ఇది తెలంగాణ రాష్ట్ర మైనింగ్ చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిపోనున్నదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు.

ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి క్వీన్స్ లాండ్ బృందానికి తన అభినందనలు తెలియజేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో సోమవారం నాడు క్వీన్స్ ల్యాండ్ (ఆస్ట్రేలియా) రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి రోస్ బేట్స్, , ఆ రాష్ట్ర అధికారుల బృందంతో నిర్వహించిన కీలక ఖనిజాల ఉత్పత్తి, వ్యాపార విస్తరణ అవకాశాల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో విద్యుత్ వాహనాలు సోలార్ విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టెమ్ లకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ రంగానికి అవసరమైన వనడియం, కోబాల్ట్, ఇండియం, క్రోమియం, టైటానియం వంటి 11 రకాల కీలక ఖనిజాలు ఎంతో అవసరమై ఉన్నాయని, ఇప్పటివరకు ఈ కీలక ఖనిజాలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. అయితే ఈ ఖనిజాల లభ్యత క్వీన్స్ లాండ్ లో అధికంగా ఉన్నందున వీటి ఉత్పత్తి, విక్రయానికి పరస్పర లబ్ధి చేకూరే వ్యాపార ఒప్పందంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చామన్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్రం 2029-30 నాటికి 20,000 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించడం ద్వారా దేశానికే అదర్శప్రాయంగా నిలవాలని ప్రణాళికలు అమలు జరుపుతోందని, ఈ విషయంలో క్వీన్ లాండ్స్ సహకారం తీసుకునే అవకాశం ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రం మరియు క్వీన్స్ ల్యాండ్ మధ్య సంయుక్త మైనింగ్ మరియు మినరల్ వ్యాపారానికి సింగరేణి సంస్థ ఒక నోడల్ ఏజెన్సీగా నియమిస్తున్నామన్నారు. సింగరేణి సంస్థ ఇప్పటికే క్వీన్స్ లాండ్స్ తో రక్షణకు సంబంధించి సిమ్టార్స్ తో, మైనింగ్ మరియు టెక్నాలజీకి సంబంధించి సి.ఎస్.ఐ. ఆర్.ఓ. తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకొని సేవలు పొందుతుందని, ఇప్పుడు క్వీన్స్ ల్యాండ్ మంత్రి సమక్షంలో కీలక ఖనిజాల వెలికితీత, భారీ ఖనిజ ఉత్పత్తి యంత్రాలు సాంకేతికత, రక్షణ పెంపుదలకు, వెంటిలేషన్ మెరుగుదల, ఎక్కువ లోతులో ఉన్న బొగ్గు నిల్వల తవ్వకానికి సంబంధించి ఆధునిక సాంకేతికత తదితర అంశాలపై పరస్పర అవగాహనతో వ్యాపార ఒప్పందం కోసం ముందుకు పోతుందన్నారు.

త్వరలోనే పై అంశాలపై అధ్యయనం మరియు అవగాహన కోసం సింగరేణి నుంచి బృందాన్ని క్వీన్స్ లాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో క్వీన్స్ ల్యాండ్ ఆర్థిక వాణిజ్య శిక్షణ మరియు ఉపాధి శాఖ మంత్రి రోస్ బేట్స్ మాట్లాడుతూ మైనింగ్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న సింగరేణితో ఇప్పటికీ తమతో గల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇక్కడికి రావడం జరిగిందన్నారు.

కీలక ఖనిజాలైన కోబాల్ట్, టైటానియం, గ్రాఫైట్, క్రోమియం, టంగ్ స్టన్, యాంటీమోనీ, రీనియం, ఇండియంతో పాటు రేర్ ఎర్త్ మినరల్స్ వంటి కీలక ఖనిజాలను తమతో కలిసి ఉత్పత్తి చేయడానికి ఉమ్మడి భాగస్వామ్యంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చామన్నారు. సౌర విద్యుత్, పవన విద్యుత్ రంగాలలో తమ తరఫున పూర్తిగా సహకరిస్తామన్నారు. తెలంగాణ-క్వీన్స్ లాండ్ రాష్ట్ర తమ మైనింగ్ , మినరల్ వనరుల సద్వినియోగ వ్యాపారాలకు నోడల్ అధికారులను నియమిస్తామని రోస్ బేట్స్ తెలిపారు. మార్చి నెలలో క్వీన్స్ లాండ్ లో పెద్ద ఎత్తున నిర్వహించే వ్యాపార సదస్సుకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం పలికారు.

ఈ సమావేశానికి సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ స్వాగతం పలుకుతూ సింగరేణి వ్యాపార విస్తరణ చర్యలు అవకాశాలు అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఆస్ట్రేలియా మంత్రి రోస్ బేట్స్ తో పాటు క్వీన్స్ లాండ్ ప్రభుత్వ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మైఖేల్ నెగెర విచ్, వాణిజ్య పెట్టుబడుల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జస్టిన్ మెక్ గోవాన్, సౌత్ ఏషియా పెట్టుబడుల సీనియర్ కమిషనర్ అభినవ్ భాటియా, సౌత్ ఏషియా సీనియర్ డైరెక్టర్ మునిష్ కౌశల్, సింగరేణి సంస్థ నుండి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ .వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ & జీఎం కో-ఆర్డినేషన్ ఎస్.డి.ఎం.సుభాని, జనరల్ మేనేజర్ సి. పి. మనోహర్, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ డి.రవి ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *