ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: దేశ వ్యాప్తం సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక జేఏసీ పిలుపుమేరకు భూగర్భ గనులతో పాటు ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికులు బుధవారం ఒక్క రోజు సమ్మె చేశారు. అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన కార్మికులంతా సమ్మె పాల్గొన్నారు. దీంతో బొగ్గు గనులు వెలవెలబోయాయి. సింగరేణి బొగ్గు గనుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం కార్మికులపై ఆలంబిస్తున్న వ్యతిరేక విధానాలు, 44 కార్మిక చట్టాలు నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయవద్దంటూ కోరాయి.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి

కార్మికుల సమ్మెతో భూపాలపల్లి డివిజన్‌లను కాకతీయ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. భూపాలపల్లి ఏరియాలో సుమారు ఆరు వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కి అంతరాయం వాటిల్లగా సింగరేణి సంస్థ కు సుమారు రూ. 3 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కాగా కార్మిక సంఘాల ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ తదితర కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలంటూ ఆయా గనుల వద్ద నల్ల బాడ్జిలతో నిరసన తెలిపారు. అంబెడ్కర్ కూడలిలో మానవహారం, ధర్నా చెపట్టి నిరసన వ్యక్తం చేశారు. 90 శాతం కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో కార్మికులు సుమారు రూ.1కోటీ 60లక్షల జీతాలు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు.
కేటీపీపీ ముందు ఉద్యోగ, కార్మిక జేఏసీ నిరసన
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేయవద్దంటూ, విద్యుత్ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ ముందు కేటీపిపి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ,కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. అదే విధంగా జిల్లాలోని పలు బ్యాంకుల ఉద్యోగులు, సిబ్బంది సమ్మెలో పాల్గొన్నాయి.