Singareni | సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..

Singareni | సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..

  • రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

Singareni | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : సింగరేణి గని కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం ఏరియా–1 పరిధిలోని జీడీకే–2 ఇంక్లైన్‌లో శనివారం నిర్వహించిన గేట్ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ టీమ్ నాయకులు కత్రోజ్ మోహన్‌బాబు, సాయికుమార్, భాస్కర్ల కిరణ్ ఆధ్వర్యంలో గని కార్మికుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమం నిర్వహించారు. 2ఏ గని ఉద్యోగులు 2ఏ మోరి నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. జీడీకే–2 ఇంక్లైన్‌కు చేరుకున్న అనంతరం బాణాసంచా, డీజే, కోలాటాలతో కార్మికులు ఉత్సాహంగా స్వాగతం తెలిపారు.

 Singareni

అనంతరం ఏరియా జీఎం లలిత్ కుమార్ తమ అధికార బృందంతో కలిసి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, కార్మికుల ప్రేమాభిమానాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయన్నారు. తనను గెలిపించి శాసనసభకు పంపిన కార్మికుల ఋణాన్ని కార్మికుని రూపంలోనే తీర్చుకుంటున్నానని తెలిపారు. గతంలో రామగుండం ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన పాలనకు భిన్నంగా, ప్రస్తుతం ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.

ఇప్పటివరకు అసెంబ్లీలో 27 సార్లు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ సింగరేణి కార్మికుల సమస్యలనే ప్రస్తావించానని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలను తప్పకుండా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. విజిలెన్స్ కేసులు, మారుపేర్లకు సంబంధించిన సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో సింగరేణి నిధులు ఇతర ప్రాంతాలకు మళ్లించగా, ప్రస్తుతం ఆ నిధులను ఇక్కడే వినియోగిస్తూ రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్స కోసం 60 రోజుల్లో కాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక నుంచి యూనియన్లకు అతీతంగా ‘రాజ్ ఠాకూర్ టీమ్’ గని కార్మికుల ప్రతి సమస్యపై పోరాడుతుందని స్పష్టం చేశారు.

 Singareni

సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కార్మికులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం క్యాంటీన్‌లో కార్మికులతో కలిసి టిఫిన్ చేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ ఠాకూర్ టీమ్ సభ్యులు సింగరేణి శ్రీనన్న, జనగామ శ్రీనివాస్, అరగంటి కృష్ణ, రసమళ్ళ కిరణ్‌తో పాటు అధికారులు, యూనియన్ నాయకులు, మహిళా ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply