- డిసెంబర్ నెలాఖరుకు రెడీ
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ డిసెంబరు నాటికి పూర్తి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలన్నీ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లోనే ఉండాలన్నారు. ఒక్కో శాఖకు ఎంత విస్తీర్ణం అవసరం ఉంటుంది, ఆ శాఖ సిబ్బంది అవసరాన్ని చూసి కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ, ఏఓలను ఆదేశించారు.
ప్రజోపయోగ శాఖలను కింది ఫ్లోర్ లోనే ఉండేటట్లు చూడాలన్నారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అన్ని ఫ్లోర్లలోని గదులను క్షుణ్ణంగా పరిశీలించి జేసీతో చర్చించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లోనే స్టాఫ్ క్యాంటీన్ కు కేటాయించిన గదిని పరిశీలించారు.
అంతకు ముందు పార్కింగ్ ఏరియాను పరిశీలించారు. ప్రవేశ ద్వారం ఎప్పటికి పూర్తి అవుతుందని అడుగగా ఈ నెలాఖరులోగా పూర్తి అవుతుందని కాంట్రాక్టర్ శ్రీరాం వివరించారు. ప్రవేశ ద్వారానికి సంబంధించి ఎలివేశన్ తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.
కాలువల ద్వారా వచ్చే నీరు ఎటువైపు వెలుతుందని అడిగి నీరు ఎక్కడా నిలువ ఉండరాదన్నారు. ప్రవేశ ద్వారానికి ముందు భాగంలో ఐలాండ్ వలే ఏర్పాటు చేసి మొక్కలు వేయాలని చెప్పారు. డ్రైనేజీ పై వేయబోయే టైల్స్, కాంపౌండ్ వాల్ గూర్చి అడిగి తెలుసుకున్నారు.
ప్రవేశ ద్వారంలో వాహనాలు, ప్రజలు నడిచి వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఉండాలన్నారు. ప్రవేశ ద్వారం నుండి కలెక్టరేట్ కు వెళ్లే మార్గం పై సుదీర్ఘంగా పరిశీలించి చర్చించారు. బయట చిన్న షాప్స్ పెట్టుకునే విధంగా స్టాల్స్ (అరకు కాఫీ, చేనేత వస్త్రాలు, తదితరమైనవి) ఏర్పాటు చేయాలని ఎస్ఈని ఆదేశించారు.
ఎంట్రన్స్ డోర్ పెద్దదిగా ఉండాలన్నారు, ఎంట్రన్స్ లో పెద్ద గోడలపై పెయింటింగ్ వేయాలని చెప్పారు. లోపల వైపు ఉన్న లాన్ లో నీరు నిల్వ ఉండరాదన్నారు. వెనుకవైపు పార్క్ లేదా ఆడుకొనేందుకు వీలుగా చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్ఈ పి. సత్యనారాయణ, ఆర్ అండ్ బి ఇఇ ఎ. తిరుపతిరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, కాంట్రాక్టర్ శ్రీరాం పాల్గొన్నారు.