Siddavatam | ఉరేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Siddavatam | ఉరేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
సిద్దవటం, (ఆంధ్రప్రభ): మండలంలోని మాచుపల్లి గ్రామానికి చెందిన లావనూరు ఇషితా రెడ్డి (18) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ సుబ్బరామచంద్ర తెలిపారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మాచుపల్లి గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి, రాజేశ్వరి దంపతులకు కుమారుడు అఖిల్ చైతన్య, కుమార్తె ఇషితా రెడ్డి ఉన్నారు. రామసుబ్బారెడ్డి కడపలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్‌గా, రాజేశ్వరి షిరిడీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తున్నారు.
అఖిల్ చైతన్య అన్నమయ్య ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుకుంటుండగా, ఇషితా రెడ్డి కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం సిఎస్ఇ చదువుతోంది. ప్రతిరోజూ నలుగురూ వారి వారి పనుల నిమిత్తం కడపకు వెళ్తుంటారు. మంగళవారం ప్రాజెక్ట్ పని ఉందంటూ ఇషితా కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది.
అదే రోజు సాయంత్రం 5 గంటల సమయంలో మేనమామ తలుపు తట్టగా స్పందన రాకపోవడంతో వెనుక వైపు వెళ్లి కిటికీ నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించిందని తెలిపారు. దీంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్‌కు పంపారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ చెప్పారు.
