Shocked News | స్మార్ట్ డ్రైవింగ్​కు చైనా చెక్

ప్రమాదాల​ నివారణకు చర్యలు
అటానమస్​ డ్రైవింగ్​పై ఆంక్షలు
ఏడీఏఎస్​ సిస్టంతో దూసుకెళ్తున్న కార్లు
అదుపుతప్పుతున్న అధునాతన వాహనాలు
ఆటోమొబైల్​ ఇండస్ట్రీ ప్రతినిధులతో భేటీ
ఎలక్ట్రికల్​ కార్లకూ షాకిచ్చిన చైనా సర్కారు

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : కారు డ్రైవింగ్‌లో స్మార్ట్ విధానం.. అటామనస్ డ్రైవింగ్​ను చైనా ప్రభుత్వం నిషేధించింది. అతివేగంతో కారు తోలడం.. అదుపు తప్పుతున్న పరిస్థితులను గుర్తించిన చైనా సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ఇటీవల ఆటోమొబల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో భేటీ అయ్యింది. షాంఘైలో జరిగిన ఈ సమావేశంలో 60 మంది వాహన తయారీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మార్చిలో షావోమీ బెస్ట్ సెల్లింగ్ ఎస్ యూ-7 సెడాన్‌ కారుకు ఘోర ప్రమాదం జరిగింది. అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్​) ఆధారంగా షావోమీ కారు డ్రైవరు తన నియంత్రణ కోల్పోయాడు. గంటకు 97 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగానే.. రోడ్డు పక్కన సిమెంట్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ప్రాథమిక పరిశోధనలు ధ్రువీకరించాయి. ఇక.. ఫిబ్రవరిలో డ్రైవింగ్‌లో ఆధునిక అంశాలను కార్ల తయారీ కంపెనీలు ప్రకటించాయి. ఓవర్ ది-ఎయిర్ టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ చేసినట్టు వివరించాయి. అంటే వాయు వేగాన్ని మించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కారును తయారు చేసినట్టు వాహన చోదకులను ఈ కంపెనీలు ఆకర్షించాయి.

ప్రమాదాల నివారణకే..

ఈ ఆధునిక టెక్నాలజీతో ప్రమాదాల నివారణ కంటే.. తీవ్ర ప్రమాదాలకు కారణం అవుతుందని చైనా ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా రిమోట్ సాప్ట్ వేర్​తో అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్​ను పరీక్షించి మెరుగుపర్చటానికి అనుమతి లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే డెలివరీ చేసిన కార్లకూ ఈ నియమం వర్తిస్తుందని తెలిపింది. కార్ల డెలివరీకి ముందు విశ్వసనీయత ధృవీకరణకు అధికారుల నుండి అనుమతి పొందటానికి తగినంత పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం సరికొత్త ఆదేశాలు జారీ చేసింది.

ఆడితో సహా మరో ఏడు బ్రాండ్లకు..

చైనాలోని ఆడి కారుతో సహా సుమారు ఏడు బ్రాండ్‌లకు అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్​ను హువావే సరఫరా చేస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆటో మార్కెట్‌లో టారిఫ్ వార్​ను ఎదుర్కోవడానికి స్మార్ట్ డ్రైవింగ్ సామర్థ్యమే కీలక విక్రయ అంశంగా పేర్కొంటూ.. అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్​తో కొత్త మోడళ్లను డెలివరీ చేయడానికి తపిస్తున్న తరుణంలో ఈ నియంత్రణ చర్య తెరమీదకు వచ్చింది. చైనాలోని బిల్డ్ యువర్ డ్రీమ్స్ కార్ల కంపెనీ ₹8.5 లక్షలు (10వేల డాలర్లు) కంటే తక్కువ ధరకే స్మార్ట్ డ్రైవింగ్ ఫీచర్లతో సుమారు 21 మోడళ్లను మార్కెట్ లోకి దించి బడా కంపెనీలకు సవాల్ విసిరింది. లీప్ మోటర్, టయోటాతో సహా ఇతర కంపెనీలూ బీవైడీ బాటపట్టాయి. సరసమైన ధరలకే స్మార్ట్ డ్రైవింగ్ కార్లను మార్కెట్లో పరుగులు తీయించాయి.

ఎలక్ట్రికల్​ కార్లకూ చైనా షాక్

ఎలక్ట్రిక్ వాహన సాంకేతికత పరిశీలనను చైనా కఠినతరం చేస్తోంది. గత ఏడాది చివరిలో మొత్తం వాహన అమ్మకాల్లో ఎలక్ట్రిక్​ వేహికల్స్ సంఖ్య పెరిగింది. ఈ ఈవీల్లో అగ్నిప్రమాదాలు, పేలుళ్లను తగ్గించే లక్ష్యంతో నియంత్రణ సంస్థలు ఈవీ బ్యాటరీ ప్రమాణాలపై నిబంధనలనూ కఠినతరం చేస్తున్నాయి. కఠినమైన రూల్స్​, నిబంధనలతో ఖర్చులు పెరుగుతాయని, ఈ సాంకేతిక అభివృద్ధితో మార్కెట్ వేగమూ మందగిస్తుందని విశ్లేషకులు, పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. కానీ, చైనా మాత్రం తన పట్టుదలను వీడటం లేదు.

Leave a Reply