Shiva temple | పార్వతి–పరమేశ్వరుల దివ్య కల్యాణం

Shiva temple | పార్వతి–పరమేశ్వరుల దివ్య కల్యాణం
Shiva temple | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నేడు పార్వతి–పరమేశ్వరుల కల్యాణం జరగనున్నట్లు ఆలయ అధ్యక్షుడు వనం పర్వతాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, పార్వతి పరమేశ్వరులను పెళ్లికుమార్తె, పెళ్లికుమారునిగా అలంకరించారు. అనంతరం మంగళ స్నానాలు చేయించారు.
లోక కల్యాణార్థం రుద్రహోమం నిర్వహించారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు గాజులతో అలంకరించుకొని గోరింటాకు పెట్టుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేడు సాయంత్రం ఉత్సవ విగ్రహాలను భజనలు, కోలాటాల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు. రాత్రి 12 గంటలకు పార్వతి–పరమేశ్వరుల దివ్య శాంతి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. పరమేశ్వరుడి తరపున కోట ప్రశాంతి కిషోర్, పార్వతి దేవి తరపున కర్నాటి నిర్మల నారాయణ దంపతులు కల్యాణంలో పాల్గొంటారని ఆయన తెలిపారు.
మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వనం పర్వతాలు, చిలువేరు ధనరాజ్, కర్నాటి రాములు, కర్నాటి నారాయణ, వనం వేణు, గుజ్జరి నర్సింహ, గంజి జగదీష్, ఇమ్మడి రమేష్, కర్నాటి నవీన్, మాకం శేఖర్, శకుంతల, గీత తదితరులు పాల్గొన్నారు.
