Shikhar Dhawan | గర్ల్‌ఫ్రెండ్ సోఫిని వివాహం చేసుకోబోతున్న శిఖర్ ధావన్

Shikhar Dhawan | గర్ల్‌ఫ్రెండ్ సోఫిని వివాహం చేసుకోబోతున్న శిఖర్ ధావన్
- ఫిబ్రవరి మూడవ వారంలో ఒక్కటి కానున్న జంట
Shikhar Dhawan | వెబ్‌డెస్క్ (స్పోర్ట్స్), ఆంధ్రప్రభ : ఒకప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పోటీపడి పరుగులు చేసిన స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్. ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తూ, ‘మిస్టర్ ఐసీసీ’గా గుర్తింపు తెచ్చుకున్న శిఖర్ ధావన్, ఫామ్ కోల్పోయి.. టీమ్‌లో ప్లేస్ కోల్పోయి, అంతర్జాతీయ క్రికెట్ (Cricket) నుంచి తప్పుకున్నాడు. ఈ టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నాడు. ధావన్, అతడి ప్రేయసి సోఫీ షైన్ వచ్చే నెల మూడవ వారంలో ఒక్కటి కానున్నారు. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ వివాహ వేడుకకు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం. ఈ వివాహ వేడుకకు ఇప్పటి నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి.

ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో ధావన్ (Dhawan) రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను సోఫీతో కలిసి వీక్షించడంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధావన్‌ను విలేకరులు గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగారు. దానికి అతడు స్పందిస్తూ, “నేను ఆమె పేరు చెప్పను కానీ, నా ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి ఆమె మాత్రమే” అని వ్యాఖ్యానించాడు.
శిఖర్ ధావన్ 2012లో ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని వివాహం (Marriage) చేసుకున్నాడు. ఈమె తన కంటే 12 ఏళ్లు పెద్దది. ధావన్‌తో పెళ్లికి ముందే ఆయేషాకి పెళ్లి అయ్యి, ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. హర్భజన్ సింగ్ ఫేస్‌బుక్‌లో ఆయేషాని చూసిన శిఖర్ ధావన్, ఆమెకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అలా ఏర్పడిన పరిచయం కాస్తా, పెళ్లి దాకా వెళ్లింది.

2008లో ఆమెతో ఎంగేజ్‌మెంట్ (Engagement) చేసుకున్న శిఖర్ ధావన్, నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. 2014లో వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. 9 ఏళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో ఆ తర్వాత కలహాలు ఏర్పడ్డాయి. భార్యాపిల్లల కోసం మెల్‌బోర్న్‌కి మకాం మార్చిన శిఖర్ ధావన్, తన సంపాదనతో వారికి బోలేడు ఆస్తులు కొన్నాడు. అయితే భార్య, తనకు మానసికంగా నరకం చూపిస్తూ వేధిస్తోందని విడాకుల కోసం అప్పీలు చేయడం సంచలనం రేపింది.
ఆయేషా ముఖర్జీ గురించి కోర్టులో శిఖర్ ధావన్ (Shikhar Dhawan) చేసిన వ్యాఖ్యలు, బయటికి వచ్చిన తర్వాత… కొడుకు జోరావర్‌ని కలవడానికి, కనీసం చూడడానికి, మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా చేసిందామె! మూడేళ్లు అయినా కొడుకుతో కనీసం వీడియో కాల్ కూడా మాట్లాడనివ్వడం లేదని, ఛాట్ చేయకుండా అన్ని మాధ్యమాల్లో బ్లాక్ చేసిందని కూడా వాపోయాడు శిఖర్ ధావన్.
