జార్ఖండ్ రాజ‌కీయ పితామ‌హుడు శిబు సొరెన్

శిబు సోరెన్ (Shibusoren) రాజకీయాలు వర్గ, కులపరంగా కాకుండా ప్రజాకేంద్రీకృతంగా సాగాయి. జాతీయ స్థాయిలో అజేయమైన గళంగా ఎదిగిన ఆయన.. గిరిజనుల గోడు దేశం విన‌డానికి కారణం ఆయనే. దిశోం గురూజీ అనే పేరుతో అభిమానుల మదిలో నిలిచిపోయిన శిబుసోరెన్ మృతి… జార్ఖండ్ రాజకీయాల్లో (Jharkhand politics) శూన్యతను సృష్టించింది. శిబు సోరెన్ మానవ హక్కుల కోసం, గిరిజనుల సంక్షేమం కోసం, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసిన కృషి ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలిపేస్తుంది. రాజకీయానికి పునాది అనే విధంగా పోరాట పటిమను మిగిల్చిన శిబు సోరెన్ ఇక లేరు.. కానీ, ఆయన ఆశయాలు ఇంకా ఆ ప్రజల హృదయాల్లో జీవిస్తూనే ఉంటాయి. అలాంటి మ‌హ‌నీయుని ఆశ‌యాలను కొన‌సాగించ‌డంలో ఆయ‌న వార‌సులుగా ఎంత‌వ‌ర‌కు స‌ఫ‌లీకృతులు అవుతార‌నేది కాల‌మే నిర్ణ‌యిస్తుంది.


ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్ అవతరించడంలో కీలక పాత్ర పోషించారు శిబూ సోరెన్. ఒక సాధారణ గిరిజన యువకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీని స్థాపించారు. రాజకీయంగా అనేక ఉద్యమాలు చేసి.. ప్రత్యేక రాష్ట్ర కల సాకారం అయ్యేలా చేశారు. జార్ఖండ్‌కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. అలాంటి శిబూ సోరెన్ ఢిల్లీలో ఆగస్టు 4న తుదిశ్వాస విడిచారు. అతి సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిన శిబు సోరెన్ గిరిజనుల హక్కుల (Tribal rights) కోసం ఆయన చేసిన కృషి ఫలితంగా ప్రజల గుండెల్లో ‘గురూజీ’గా నిలిచిపోయారు. ఆయ‌న రాజ‌కీయ వార‌సుడుగా హేమంత్ సోరెన్ (Hemant Soren) ఉన్నారు. ఈయ‌న ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తండ్రి మ‌ర‌ణం అనంత‌రం హేమంత్ సోరెన్ తీవ్రంగా స్పందించారు. ‘‘గౌరవనీయులైన దిశోం గురూజీ మనందరినీ విడిచిపోయారు. ఈ రోజు నేను శూన్యంలో ఉన్నాను,’’ అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఈ మాటలు శిబుసోరెన్‌ ఎలాంటి త్యాగపథాన్ని మిగిల్చారో తెలుపుతున్నాయి.


తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు శిబూ సోరెన్ సంపూర్ణ మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా తెలంగాణ డిమాండ్‌ను వినిపించడంలో శిబూ సోరెన్ అండగా నిలబడ్డారు. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శిబూ సోరెన్.. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి చాలా రకాలుగా దోహదపడింది. కేసీఆర్ (KCR).. తన రాజకీయ ప్రస్థానంలో శిబూ సోరెన్‌ను పలుమార్లు కలిశారు. 2022లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కలవడానికి వెళ్లినప్పుడు.. శిబూ సోరెన్‌ కాళ్లకు నమస్కరించారు కేసీఆర్. రాజకీయాల్లో చాణక్యుడి (Politics Chanakya) గా గుర్తింపు పొందిన కేసీఆర్.. శిబూ సోరెన్‌కు ఎలాంటి గౌరవం ఇచ్చారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు


శిబు సోరెన్ 1944 జనవరి 11న రామ్‌గఢ్ (Ramgarh) లోని నెమ్రా గ్రామంలో జన్మించారు. గిరిజనులలో దిషోం గురువు అనే ఇమేజ్‌ను సృష్టించిన శిబు సోరెన్ తండ్రి సోబరన్ మాంఝీని వడ్డీ వ్యాపారులు హత్య చేశారు. ఈ పరిణామం అనంతరం కేవలం 13 వయస్సు నుంచే గిరిజనులు, స్థానిక ప్రజలు, దళితులు, వెనుకబడిన తరగతుల హక్కుల కోసం వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. ఈ క్రమంలో 1960లలో ఆయన గిరిజన హక్కుల కోసం, నీరు-అటవీ-భూమి రక్షణ కోసం పోరాటం ప్రారంభించారు.


శిబు సోరెన్ 1970లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM)ను స్థాపించారు. ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రాన్ని (Jharkhand state) డిమాండ్ చేస్తూ ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంలో గిరిజనుల భూమిహక్కులు, వారిపై జరుగుతున్న దోపిడీ , అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన తన గొంతు విప్పారు. నీరు, అడవి, భూమి కోసం, ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం 40 సంవత్సరాలు పోరాడారు. ఉద్యమ సమయంలో ఆయన ఎక్కువ సమయం అడవులు, పర్వతాలలో గడిపాడు. ఈ సమయంలో ఆయన హత్యతో సహా అనేక తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఆరోపణాలు ఎదుర్కొన్నారు. జైలు (jail) కు కూడా వెళ్ళాడు. ఆయన కృషి, సుదీర్ఘ పోరాటం ఫలితంగా 2000 నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది.


శింబు సోరన్ 1977లో తుండి అసెంబ్లీ నుండి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటి ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. దీని తరువాత శిబు సోరెన్ సంతల్ పరగణా దుమ్కా (Santhal Pargana Dumka) లోక్‌సభను తన రాజకీయ కర్మభూమిగా చేసుకున్నారు. 1980లో ఇక్కడి నుండి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌కు చెందిన పృథ్వీచంద్ కిస్కును ఓడించి మొదటిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఆ విజయం తరువాత ఆయన ఎన్నడు వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన అనేకసార్లు పార్లమెంటులో గిరిజన సమస్యలను లేవనెత్తారు.


జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు చురుకైన పాత్ర పోషించారు శిబు సోరన్. ఆయన కృషి, సుదీర్ఘ పోరాటం ఫలితంగా 2000 నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత శిబు సోరెన్ జార్ఖండ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రి (Three times Chief Minister) అయ్యారు – 2005, 2008, 2009లో. అయితే, రాజకీయ అస్థిరత, సంకీర్ణ రాజకీయాల కారణంగా ఆయన పదవీకాలం ఎక్కువ కాలం కొనసాగలేదు. అయినప్పటికీ, గిరిజన సంక్షేమం, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు.


దివంగత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో దివంగత శిబు సోరెన్ రెండుసార్లు బొగ్గు మంత్రి (Two-times Coal Minister) గా పనిచేశారు. అలాగే ఆయన మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎనిమిది సార్లు దుమ్కా పార్లమెంటరీ స్థానం నుండి ఎంపీగా ఉండటమే కాకుండా, జామా అసెంబ్లీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.


ఆయన రాజకీయ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. అవినీతి (Corruption), హత్య వంటి తీవ్రమైన కేసుల్లో శిబు సోరెన్ పై ఆరోపణలు వచ్చాయి, అయితే తరువాత అనేక కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. 1995లో శిబు సోరెన్‌ను JAC అధ్యక్షుడిగా నియమించారు. ఇది ప్రత్యేక జార్ఖండ్ (Jharkhand) రాష్ట్ర ఏర్పాటుకు మొదటి అడుగు. ఈ కారణంగానే శిబు సోరెన్ జార్ఖండ్‌లోనే కాకుండా మొత్తం దేశంలో ఒక ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు.


శిబూను ఆయన అభిమానులు ‘దిశోం గురు’ అని ప్రేమతో పిలుచుకుంటారు. సంతాలీ భాషలో ఆ మాటలకు మార్గదర్శకుడైన గురువు అని అర్థం. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక రాష్ట్ర పోరాటాలకు శిబూ సోరెన్‌ మార్గదర్శి (guide) గా, గురుతుల్యునిగా నిలిచారు. ప్రత్యేక ఝార్ఖండ్‌ రాష్ర్టాన్ని కలగనడమే కాకుండా అవిశ్రాంత పోరాటంతో దానిని సాధించిన దార్శనిక నేత శిబూ సోరెన్‌. రాజీలేని పోరాటం జరపడం ఎలాగో ఆయనను చూసే నేర్చుకోవాలి. ఆయన ఉద్యమస్ఫూర్తితోనే కేసీఆర్‌ తెలంగాణ సాధనకు ఉద్యుక్తుడయ్యారు. మలిదశ ఉద్యమ ప్రస్థానానికి నాందీ ప్రస్తావనగా నిలిచిన కరీంనగర్ (Karimnagar) సింహగర్జన సభకు శిబూ స్వయంగా హాజరై మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించడం విశేషం. తెలంగాణ ఏర్పాటుకు ఆయన అడుగడుగునా సహాయ సహకారాలు అందించారు. ఆ మహానుభావుని స్ఫూర్తి తెలంగాణ ప్రజలకు చిరస్మరణీయం.


శిబూ సోరెన్ 1944 జనవరి 11న జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా నెమ్రా గ్రామంలోని గిరిజన కుటుంబంలో జన్మించారు. స్థానిక పాఠశాలల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆయనకు భార్య రూపీ సోరేన్ (Rupee Soren), నలుగురు సంతానం ఉన్నారు. అందులో ముగ్గురు కొడుకులు.. హేమంత్‌, బసంత్‌, దుర్గా సోరెన్‌. కుమార్తె పేరు అంజలి. 2009లో దుర్గా సోరెన్‌ మృతి చెందారు. ప్రస్తుతం బసంత్‌.. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

Leave a Reply