SHE Teams | మఫ్టీలో షీ టీమ్స్ నిఘా..

SHE Teams | మఫ్టీలో షీ టీమ్స్ నిఘా..
మహిళల భద్రత కోసం
సోషల్ మీడియా పట్ల జాగ్రత్త
సీపీ అంబర్ కిషోర్ ఝా
SHE Teams | రామగుండం, ఆంధ్రప్రభ : మహిళలు, యువతుల రక్షణ కోసమే షీటీంలు (SHE Teams) ఉన్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) తెలియజేశారు. మహిళల రక్షణ, భద్రత పోలీసు బాధ్యతలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ స్కూల్, కళాశాలలు, ఆఫీస్ లు ముగిసే సమయానికి స్కూల్స్, కళాశాల, బస్టాండ్ ప్రధాన కూడళ్ల వద్ద ఎక్కువగా బాలికలు, మహిళలు ప్రయాణాలు చేసే సమయంలో వారిని ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా అని క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్య సాధారణ జనాల మాదిరిగా మఫ్టీలో ఉంటూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మహిళల రక్షణ (women Protection) కోసమే షీటీం పనిచేస్తుందని, కమిషనరేట్ పరిధిలో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో కేసు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్య వివాహాలు, మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్య వచ్చినప్పుడు 100కు డయల్ చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. టీ సేఫ్ యాప్, మహిళల భద్రత, రక్షణ చర్యలు, తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్య పరుస్తున్నామన్నారు. షీ టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, లేదా ఆన్ లైన్ క్యూఆర్ కోడ్, వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తామన్నారు.
ఎవరైనా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే ధైర్యంగా పోలీసులకు (police) తెలియజేయాలన్నారు. బాలికలు, మహిళలు ఎక్కడ ఉన్నా భద్రతగా ఉండటం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అన్నారు. పోలీసు శాఖ మీకు అండగా ఉంటుందన్నారు. మీ భద్రత కోసం 24గంటలు సిద్ధంగా ఉన్నాం, తప్పు చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవడానికి మీ సమాచారమే వారిపై చట్ట పరమైన చర్యలకు ఆధారమన్నారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం నెంబర్ 6303923700, పెద్దపల్లి జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386 మంచిర్యాల జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386 కి కాల్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ 100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలన్నారు.
