- స్థానిక ఎన్నికలకు సన్నాహం
- చిత్తూరులో తొలి సమావేశం
- 7చోట్ల జిల్లా పార్టీ సమావేశాలు
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో ( రాయలసీమ ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమ పార్టీని రాబోయే స్థానిక ఎన్నికలకు సన్నద్ధం చేసే లక్ష్యంతో మొదలుపెట్టిన రాష్ట్ర పర్యటనను రాయలసీమ నుంచి ప్రారంభించనున్నారు. ఈనెల 9వ తేదీన చిత్తూరులో మొదలుపెట్టే ఆ పర్యటన అయిదు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో కొనసాగనున్నది. ఆసందర్భంగా రాయలసీమ పరిధిలోని జిల్లాల్లో 7చోట్ల జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో 2014, 2019 వరుస ఎన్నికల్లో ఘోర పరాజయాలను చవిచూసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని స్వీకరించిన వైఎస్ షర్మిల 2024 ఎన్నికల్లో కూడా పార్టీని ఓటమి నుంచి కాపాడలేకపోయారు. ఆ ఎన్నికల్లో కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షర్మిల మూడో స్థానానికి పరిమితం కావాల్సివచ్చింది. అన్నింటికన్నా ముఖ్యంగా దశాబ్దాల తరబడి రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ల మధ్య కాలంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో నామమాత్రపు పోటీకి పరిమితం కావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతుంది. మరోవైపు పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని దీక్షబూనిన షర్మిల 2024 ఎన్నికల అనంతరం గత ఏడాది మధ్యకాలంలో మీడియా ప్రకటనలకు, ఎంపిక చేసుకున్న సమస్యలపై పోరాడేందుకు పరిమితమయ్యారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేసే లక్ష్యంతో జిల్లాల స్థాయి సమావేశాలు నిర్వహించడానికి పర్యటించాలని నిర్ణయించారు.
ఆమేరకు ఈనెల 9వ తేదీన షర్మిల రాష్ట్ర స్థాయి పర్యటనను రాయలసీమ జిల్లాల నుంచి మొదలు పెట్టనున్నారు. ఖరారైన కార్యక్రమం ప్రకారం ఈనెల 9వ తేదీ సాయంత్రం చిత్తూరులో నిర్వహించే పార్టీ జిల్లా సమావేశంతో షర్మిల పర్యటన మొదలు కానున్నది. 10వ తేదీ ఉదయం అన్నమయ్య జిల్లా రాజంపేట, రాయచోటి, సాయంత్రం సత్యసాయి జిల్లా హిందూపురంలో సమావేశాలు నిర్వహిస్తారు. 11 వతేదీ ఉదయం అనంతపురం జిల్లా కేంద్రంలో, సాయంత్రం కర్నూలు జిల్లా కేంద్రంలో సమావేశాలు నిర్వహిస్తారు. 12వ తేదీ ఉదయం నంద్యాల జిల్లా కేంద్రంలో, సాయంత్రం వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలో సమావేశాలు నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం నెల్లూరు జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి అదేరోజు సాయంత్రం తిరుపతి జిల్లాకు వచ్చి తిరుపతిలో కానీ శ్రీకాళహస్తిలో కానీ నిర్వహించే జిల్లా పార్టీ సమావేశాల్లో పాల్గొంటారు. తరువాత 18వ తేదీన విశాఖపట్నం జిల్లా నుంచి 20వ తేదీన అనకాపల్లి జిల్లా వరకు పర్యటించి ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశాల్లో, 25వ తేదీన గుంటూరు జిల్లా నుంచి 30వ తేదీన ఎన్టీఆర్ కృష్ణ జిల్లా వరకు మిగిలిన జిల్లాల సమావేశాల్లో పాల్గొంటారు.
ఈ సమావేశాల్లో షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలైన యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్, ఎస్ సి, ఎస్ టి, ఓబీసీ, మైనారిటీ విభాగాల రాష్ట్ర శాఖల అధ్యక్షులు కూడా పాల్గొననున్నారు. ప్రధానంగా ఆయా జిల్లాల్లో పార్టీ స్థితిగతులను అధ్యయనం చేయడం, జిల్లా పార్టీ నాయకుల పనితీరును సమీక్షించడం, జిల్లాల్లోని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచి వచ్చే ఏడాది జరిగే స్థానిక ఎన్నికలకు సిద్ధం చేయడం అనే మౌలిక లక్ష్యాల మేరకే షర్మిల పర్యటన కొనసాగుతుందని తెలుస్తోంది. గత పదేళ్ల రాజకీయ సమీకరణల అనుభవాలతో కునారిల్లిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గాడిలో పెట్టి ముందుగా వచ్చే ఏడాది జరిగే స్థానిక ఎన్నికలకు, తరువాత 2029లో జరిగే సాధారణ ఎన్నికలకు సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో షర్మిల చేపట్టిన తాజా పర్యటన ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే విషయం తేలాలంటే వేచిచూడాల్సిందే.