Sharmila Fire  : గొంతు నొక్కే కుట్ర Andhra Prabha News

Sharmila Fire  : గొంతు నొక్కే కుట్ర Andhra Prabha News

మోదీ నిరంకుశత్వానికి పరాకాష్ట

ప్రశ్నించే స్వరాన్ని చంపాలనే ప్రయత్నం

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో)

విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేయడం సిగ్గుచేటని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (Sharmila Fire)  తీవ్రంగా విమర్శించారు. ఇది ప్రశ్నించే గొంతును చంపాలనే కుట్రగా అభివర్ణించారు. దేశ ప్రతిపక్ష నేతపై సబ్‌ స్టాంటివ్ మోషన్ పెట్టడం ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశత్వానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. అమెరికా ట్రేడ్ డీల్‌పై రాహుల్ గాంధీ నిజాలు వెలుగులోకి తెస్తే మోదీ వణికిపోతున్నారని ఆరోపించారు. అందుకే సభాహక్కుల పేరుతో రాహుల్ గాంధీ గొంతు నొక్కాలని చూస్తున్నారని తెలిపారు. బ్లాక్ డీల్‌పై కుండబద్దలు కొట్టినందుకు రాహుల్ గాంధీని దేశద్రోహిగా ముద్ర వేయడం అన్యాయమన్నారు. వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యాడంటూ నిందలు వేయడం, నిధులు, ఆత్మకథల పేరుతో కట్టుకథలు అల్లడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇదేనా ఆర్‌ఎస్‌ఎస్ ఉగ్రవాద రాజకీయమని ప్రశ్నించారు.

Sharmila Fire  అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఏకంగా భారత ఇంధన భద్రతను అక్కడి ప్రయోజనాలకు కట్టబెట్టారని విమర్శించారు. అగ్రరాజ్య ఒత్తిడికి సాగిలపడి దేశ భవిష్యత్తునే తాకట్టు పెట్టారని ఆరోపించారు. భారత రైతులను ఉరికొయ్య ఎక్కించారని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని వ్యాఖ్యానించారు. అమెరికాతో ట్రేడ్ డీల్‌లో భారత్‌కు దామాషా ప్రయోజనాలేమీ లేవని, ఇరాన్, రష్యా లేదా ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలా వద్దా అన్నది అమెరికా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు.  రాహుల్ గాంధీపై ఎలాంటి హక్కుల తీర్మానం పెట్టినా కాంగ్రెస్ ప్రజల పక్షానే నిలుస్తుందని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తును కాపాడే విషయంలో కాంగ్రెస్ వెనుకంజ వేయదని, దేశ ప్రజలు ఇప్పుడు రాహుల్ గాంధీ పక్షాన ఉన్నారని వైఎస్ షర్మిలా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply