Shankarapatnam | కొత్తగట్టులో దుండగుల దాడి..

Shankarapatnam | కొత్తగట్టులో దుండగుల దాడి..

  • ఒకే రాత్రి మూడు ఇళ్లలో చోరీ..
  • తాళాలు పగలగొట్టి దుండగుల దాడి
  • బంగారం, వెండి, బైక్‌తో పరార్
  • పోలీసులకు బాధితుల ఫిర్యాదు

Shankarapatnam | శంకరపట్నం, ఆంధ్రప్రభ : కొత్తగట్టు గ్రామంలో ఒకే రాత్రి మూడు చోట్ల గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, కేశవపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొత్తగట్టు గ్రామంలో శనివారం రాత్రి ఈ చోరీలు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన మడ్డి రమా శ్రీనివాస్, పెసర రాజేశ్వరి హైదరాబాదులో కూలీ పనులు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వారు గ్రామానికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది.

గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాస్, రాజేశ్వరి ఇండ్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. అలాగే గ్రామానికి చెందిన బీజేపీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్‌రెడ్డికి చెందిన హీరో హోండా గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని కూడా దొంగిలించారు. మడ్డి రమా శ్రీనివాస్ ఇంటి నుంచి అర తులం బంగారు కమ్మలు, బుట్టాలు ఎత్తుకెళ్లగా, రాజేశ్వరి ఇంటి నుంచి రెండు తులాల పుస్తెలతాడు, సుమారు 40 తులాల వెండి, రూ.20 వేల నగదు దొంగిలించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న కేశవపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సమయంలో విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని మండల ప్రజలకు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి సూచించారు.

Leave a Reply