52 రోజుల తర్వాత గర్భగుడికి చేరుకున్న భక్తులు

  • ముందు జాగ్రత్తలు పాటించకపోవడంతో గ్రిల్స్‌ ధ్వంసం

పాపన్నపేట, ఆంధ్రప్రభ : మంజీరా నది వరద బీభత్సం సృష్టించడంతో ఏడుపాయల ఆలయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సింగూరు ప్రాజెక్టులో వరద పెరగడంతో ఆగస్టు 12న గేట్లు ఎత్తి విడుదల చేశారు. నీరు విడిచి పెడుతున్నట్లు సంబంధిత శాఖ అధికారులు హెచ్చరించినప్పటికీ ఆలయ అధికారులు కేవలం హుండీలను ఆలయం నుండి తొలగించారే తప్ప మిగిలినవి పట్టించుకోలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతో భారీగా నష్టం ఏర్పడిందని భక్తులు మండిపడుతున్నారు.

మంజీరా నదిలో నీటి ఉధృతంగా ప్రవహించడంతో ఆగస్టు 14న ఆలయం జలదిగ్భందమైంది. అప్పటి నుంచి శనివారం వరకూ రాజగోపురంలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అయితే గత రెండు రోజుల నుంచి వరద ఉధృతి తగ్గడంతో ఆలయ సిబ్బంది వెెళ్లి పరిశీలించి ఆలయాన్ని శుద్ధి చేసే పనిని ప్రారంభించారు. నీటి ఉధృతికి ఆలయ మండపానికి ఉన్న గ్రిల్స్‌ వరద ఉధృతికి పూర్తిగా ధ్వంసం కావడంతో అస్తవ్యస్థంగా మారింది.

ఆలయ అధికారులు సరైన సమయంలో స్పందించి ఉంటే ఆలయానికి తీవ్ర నష్టం జరగకుండా ఉండేదని పలువురు భక్తులు అన్నారు. వరద ఉధృతితో గ్రిల్స్‌ విరిగిపోయి కొట్టుకుపోయాయి. దీంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. ప్రతి ఏటా వర్షా కాలంలో ఆలయానికి వరద తాకిడి ఏర్పడుతుందని తలంచి, గత నాలుగు ఏళ్ల క్రితం ఆలయ మంటపానికి వరదల నుండి నష్టం వాటిల్లకుండా గ్రిల్స్‌ దెబ్బతినకుండా ఉండేందుకు అప్పటి ఆలయ ఈవో సార శ్రీనివాస్‌, పాలక మండలి చైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి లు గ్రిల్స్‌ అవసరాన్ని బట్టి విప్పి భద్రపరిచి మళ్లి ఏర్పాటు చేసే విధంగా గ్రిల్స్‌కు పట్టాలను, నట్టు బోల్టు ఏర్పాటు చేశారు.

సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీరు వదిలినప్పుడు ఆలయ మంటపానికి ఉన్న గ్రిల్స్‌ తొలగించి భద్రపరుస్తూ ఉండే వారు. వరదలు తగ్గిన వెంటనే వాటిని తిరిగి ఆలయ మంటపానికి బిగించేవారు. అయితే ఆలయ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఆలయ మంటప గ్రిల్స్‌ వరద తాకిడికి ధ్వంసమయ్యాయని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు.

Leave a Reply