ఢిల్లీ : గోడ కూలి ఏడుగురు మృతిచెందిన విషాద ఘటన దేశరాజధాని ఢిల్లీ (Delhi) లో చోటుచేసుకుంది. ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జైత్ పూర్ (Jaitpur) లో భారీ వర్షాలకు గోడ కూలడంతో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. హరినగర్ లో జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Firefighters) ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తొలుత 8 మందికి గాయాలవ్వగా వారిని ఆస్పత్రికి తరలించారు.
సఫ్దర్ జంగ్ ఆస్పత్రి (Safdar Jung Hospital), ఎయిమ్స్ ట్రామా సెంటర్ (AIIMS Trauma Center) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏడుగురు మరణించగా.. ఒకరికి మాత్రం చికిత్స కొనసాగుతోంది. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మృతులను షబీబుల్ (30), రబీబుల్ (30), రుబీనా (25), ముట్టు అలీ (45), డాలీ (25), రుక్సానా (6), హసీనా (7)లుగా గుర్తించారు. కాగా.. గోడ కూలడానికి గల కారణాలను అధికారులు (Officers) పరిశీలిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పాత, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.