Sesachalam Forest: అడవుల్లో కొత్త జీవి.. అరుదైన ‘నలికిరి’ గుర్తింపు

తిరుపతి : తూర్పు కనుమల్లో విస్తరించిన శేషాచలం రిజర్వ్‌ ఫారెస్ట్‌ జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఇక్కడి అటవీ ప్రాంతంలో జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (Zoological Survey of India) (జెడ్ఎస్ఐ) శాస్త్రవేత్తలు ఒక అరుదైన, కొత్త జాతికి చెందిన స్కింక్‌ (నలికిరి)ను కనుగొన్నారు. ఈ కీలక విషయాన్ని జెడ్ఎస్ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ ధ్రితి బెనర్జీ వెల్లడించారు. ఈ నూతన ఆవిష్కరణ జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పింది.

కొత్తగా గుర్తించిన ఈ స్కింక్‌ జాతికి డెక్కన్‌ గ్రాసైల్‌ స్కింక్‌ (Deccan gracile skink) అని శాస్త్రీయ నామకరణం చేసినట్టు డాక్టర్‌ బెనర్జీ తెలిపారు. ఈ జీవి చూడటానికి పామును పోలి ఉంటుందని, దీనికి పాక్షిక పారదర్శకమైన కనురెప్పలు, శరీరంపై విభిన్నమైన చారలు ఉన్నాయని ఆమె వివరించారు. ప్రస్తుతం ఈ అరుదైన జీవి ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అటవీ ప్రాంతం (Sesachalam Forest) తో పాటు, తెలంగాణలోని అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో మాత్రమే కనిపిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఇటువంటి ప్రత్యేక జీవి మనుగడ సాగిస్తుండటం అక్కడి జీవావరణ వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేస్తోందని డాక్టర్‌ బెనర్జీ పేర్కొన్నారు.

ఈ ముఖ్యమైన పరిశోధనలో జెడ్ఎస్ఐకి చెందిన హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం, కోల్‌కతాలోని రెప్టిలియా విభాగం (Reptilia Division) శాస్త్రవేత్తలతో పాటు లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియంకు చెందిన పరిశోధకులు కూడా పాలుపంచుకున్నారని జెడ్ఎస్ఐ ప్రతినిధి డాక్టర్‌ దీపా జైస్వాల్‌ తన ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఆవిష్కరణలు తూర్పు కనుమల ప్రాంతంలోని జీవ వైవిధ్య సంపదను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, దాని పరిరక్షణకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply