మణుగూరులో వరుస చోరీలు..
రాత్రి అయ్యిందంటే చాలు టెన్షన్ పడుతున్నారు. అస్సలు నిద్రపట్టడం లేదట. కారణం ఏంటంటారా..? తమ విలువైన సంపదను దాచుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారట. ఎటు నుంచి ఏ దొంగ వస్తాడో..? దాచుకుంది అంతా దోచుకుంటాడో అని కంటిమీ కనుకు లేకుండా భయపడుతున్నారట. ఇప్పుడు అంతా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. కష్టపడకూడదు.. డబ్బు వచ్చేయాలి.. చాలా వరకు ఇదే ఆలోచనలో ఉన్నారు. అందుకనే.. దొరికితే దొంగ.. దొరకకపోతే దొర అన్నట్టుగా ఈజీ మనీ కోసం దొంగతనాలను ఎంచుకుంటున్నారు. ఎంత నిఘాపెట్టినా.. మా రూటే వేరు.. అన్నట్టుగా రాత్రులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మణుగూరు పట్టణంలో వరుస దొంగతనాల పై ఆంధ్రప్రభ అందిస్తున్న ప్రత్యేక కథనం.
మణుగూరు, (ఆంధ్రప్రభ): ఒకప్పుడు ఊరు వెళ్లాలంటే.. ఏమాత్రం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వెళ్లేచ్చేవారు. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. వారాలు కూడా కాదు.. కొన్ని నెలలు పాటు ఊరు వెళ్లాల్సి వచ్చినా ఏమాత్రం టెన్షన్ లేకుండా వెళ్లొచ్చేవారు. అయితే.. ఇప్పుడు దొంగతనాలు పట్టణంలో వరుసగా జరుగుతుండడంతో పట్టుమని ఇల్లు వదిలి గంట పాటు ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రి అయ్యిందంటే చాలు.. దొంగలు ఎటు వైపు నుంచి వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లను ఎత్తుకెళ్తారన్న భయంతో క్షణం, క్షణం బ్రతుకుతున్నారు. కొన్ని సమయాల్లో అయితే.. ఇంట్లో నిద్రిస్తుండగానే… డబ్బు, నగలు, విలువైన వస్తువులను దర్జాగా దోచుకెళ్తున్నారు. ఉదయం లేచి చూడగానే బీరువాలు, అల్మారాలు చిందరవందరగా పడి ఉండడాన్ని చూసి దొంగతనం జరిగిందని ప్రజలు నిర్దారించుకుంటున్నారు. దొంగలు కూడా పోలీస్‌శాఖకు సవాల్ విసురుతూ… కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఎన్ని నిఘా నేత్రాలు ఉన్నా… మా దొంగతనం ఆగేదేలే… ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులను దోచుకెళ్తున్నారు.
మణుగూరు మండలం ఇండస్ట్రీయల్ ప్రాంతం కావడంతో ఇటీవల మండల వ్యాప్తంగా వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో ఎటు నుండి ఎవరు వచ్చి దోచుకెళ్తారోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొంత మంది అయితే.. డబ్బులు, బంగారం, విలువైన వస్తువులను ఇంట్లో పెడితే ఎక్కడ దోచుకెళ్తారోనని బ్యాంక్ లాకర్లలో దాచిపెట్టుకుంటున్నారు. రోజు రోజుకు టెక్నాలజీ మారుతున్న కొద్దీ దొంగలు కూడా టెక్నాలజీకి అనుగుణంగా బాటలు వేస్తూ కొత్త రకాల టెక్నిక్‌లు ఉపయోగిస్తున్నారు.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ… ఆ కెమెరాల్లో కనబడకుండా శరీరాన్ని అంతా దుస్తులతో కప్పి వేస్తూ.. ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్తలు పడుతున్నారు. పగలేమో వస్తువుల అమ్మకాలు అంటూ.. కాలనీ, కాలనీ తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తున్నారు.. రాత్రి సమయాల్లో తాళాలు ఉన్న ఇంటిని ఎంచుకుని దొంగతనానికి పాల్పడుతున్నారు.
చుట్టూప్రక్కల వారు గమనించినప్పుడు దొంగలు పారిపోతున్నప్పటికీ… కొన్ని చోట్ల మాత్రం దాడులకు పాల్పడుతూ… యధేచ్చగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మణుగూరు మండల వ్యాప్తంగా ఎన్నో దొంగతనాలు జరిగినప్పటికీ.. కొన్ని కేసుల్లో మాత్రమే పురోగతి కనిపించింది. ఇంకా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీసులు ఎంతలా నిఘా పెట్టినా.. దొంగతనాలు తగ్గడం లేదు.. ఇంకా చెప్పాలంటే.. రోజురోజుకు ఇంకాస్త పెరుగుతున్నాయి. మణుగూరు మండలం ఇండస్ట్రీయల్ ప్రాంతం కావడంతో ఎక్కువగా కార్మికులు నివసిస్తుంటారు. కార్మిక కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని దొంగలు డబ్బులు, నగలు ఎక్కువ మోతాదులో ఉంటాయని ఆశతో ఎవరైనా కార్మికుడు ఇంట్లో లేని సమయంలో చూసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీటితో పాటు ద్విచక్ర వాహనాలను కూడా చోరీ చేస్తున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారు కొత్త వారా..? లేక పాత దొంగలా..? అని కనిపెట్టడంలో పోలీస్‌శాఖ సందిగ్ధంలో పడింది. పోలీస్ శాఖ మరింత దృష్టి సారించి దొంగతనాలకు ఎప్పుడు అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాలి.

