ఢిల్లీ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు..

ఢిలీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ సీఎం రేవంత్, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రాణం పోసేందుకు బీజేపీ నేతలు యూరియా కొరత నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ – బీఆర్‌ఎస్ కలిసి వేసిన దుష్ప్రచారం వల్లే రైతులు అవసరానికి మించి యూరియా కొంటున్నారని అన్నారు. రైతులను శిక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని అపకీర్తిపాలు చేయాలన్నదే వీరి ఉద్దేశమని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని, అయితే ఈ విషయమై అన్ని పరిస్థితులను హైకోర్టుకు వివరించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బిల్లుల పెండింగ్‌పై సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలపై స్పష్టమైన నిర్ణయం వస్తుందని తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ పై ప్రచారం అసత్యం..

ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించామనే ప్రచారంలో నిజం లేదని సీఎం రేవంత్ ఖండించారు. ఆ కేసు హైకోర్టు పర్యవేక్షణలోనే సాగుతోందని అన్నారు. ఇక‌ కాళేశ్వరం కేసును సీబీఐకి ఇవ్వడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత్రను ప్రశ్నించారు. ఆయనకు స్వతంత్ర అభిప్రాయాలు లేవని, కేటీఆర్ సూచనలతోనే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పగిస్తే 48 గంటల్లోనే విచారణ ప్రారంభిస్తామని చెప్పారని, కానీ ఇంతవరకు సీబీఐ ముందుకు రాకపోవడం కిషన్ రెడ్డి సహకారమేనని ఆరోపించారు.

మెట్రో విస్తరణపై కుట్రలు

మెట్రో రైలు విస్తరణకు కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని సీఎం ఆరోపించారు. తాను ఢిల్లీలో ప్రధానిని కలిసిన ప్రతిసారీ ఎల్ అండ్ టీ సంస్థ నష్టాలను తెరమీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఇది కొత్త ప్రాజెక్టు కాదని, ఉన్న మెట్రోకే విస్తరణ చేస్తున్నామని స్పష్టం చేశారు. కేటీఆర్ తనపై విమర్శలు చేస్తూ “లోకేశ్ తమ్ముడు” అని పిలుస్తున్నారని, కానీ చంద్రబాబు – లోకేశ్ జైల్లో ఉన్నప్పుడు మాత్రం మౌనం వహించారని ప్రశ్నించారు.

అది ఆస్తి పంచాయితీ..

ఎమ్మెల్సీ కవిత వ్యవహారం పూర్తిగా వారి కుటుంబ సమస్య అని స్పష్టం చేశారు. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే మాత్రం వ్యతిరేకిస్తానని తేల్చిచెప్పారు. కవితపై హరీశ్ రావు, కేటీఆర్, కేసీఆర్, సంతోష్ రావు దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది ఆస్తి పంచాయితీ తప్ప మరేదీ కాదని చెప్పారు. కేసీఆర్ ఉద్యమం పేరుతో యువతను బలి తీసుకున్నారని, అదే ఉసురు ఇప్పుడు వారి కుటుంబాన్ని తాకుతోందని అన్నారు.

పార్టీ ఫిరాయింపులపై వ్యాఖ్య

పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా ముఖ్యమంత్రి స్పందించారు. కండువా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మార్చినట్లు కాదని స్పష్టం చేశారు. తాను కూడా చాలా కార్యక్రమాల్లో కండువాలు కప్పానని, వాటి రంగు ఎవరు పట్టించుకోలేదని చెప్పారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే అనర్హతపై నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

Leave a Reply