Secretariat | విప్లవాత్మకమైన మార్పులు..

Secretariat | విప్లవాత్మకమైన మార్పులు..

చిత్తూరు, ఆంధ్రప్రభ : గ్రామీణ, పట్టణ ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయాలనే సంప్రదాయ పరిపాలనా ఆలోచనకు బలమిస్తూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సేవల నాణ్యత పెంపు, సంక్షేమ పథకాలు అర్హులకు నేరుగా చేరేలా చూడడం, సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవడం లక్ష్యంగా ఉద్యోగుల హేతుబద్ధీకరణ, పని తీరు పర్యవేక్షణ, ఆధునిక సాంకేతికత వినియోగం పై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. సచివాలయాలు ఇక పై కేవలం సర్టిఫికెట్లు జారీ చేసే కార్యాలయాలుగా కాకుండా, గ్రామాభివృద్ధికి కేంద్ర బిందువులుగా మారనున్నాయి. గ్రామ సచివాలయాల (Village Secretariats) ద్వారా పరిపాలనా వికేంద్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సంక్షేమం వంటి అనేక విభాగాలకు సంబంధించిన సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా వ్యవస్థను రూపకల్పన చేశారు. చిన్న అవసరం వచ్చినా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా, తమ గ్రామంలోనే సేవలు పొందే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరిగి, లబ్ధిదారులకు నేరుగా ఫలితాలు అందుతున్నాయి.

Secretariat

Secretariat | సిబ్బంది పునర్వ్యవస్థీకరణ..

సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఉద్యోగుల రేషనలైజేషన్‌ పై ప్రభుత్వం (GOVT) దృష్టి సారించింది. జిల్లాలో ప్రస్తుతం 612 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా, వీటిలో సుమారు 4,500 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా రూపకల్పన చేసినప్పటికీ, వాస్తవ పరిస్థితుల్లో కొన్ని చోట్ల సిబ్బంది అధికంగా, మరికొన్ని చోట్ల కొరతగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో సుమారు 730 మంది సిబ్బంది అదనంగా ఉన్న నేపథ్యంలో, జనాభా ప్రాతిపదికన సిబ్బంది కేటాయింపును సవరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేషనలైజేషన్‌లో భాగంగా సిబ్బందిని మల్టీపర్పస్‌, టెక్నికల్‌ విభాగాలుగా విభజించనున్నారు. మల్టీపర్పస్‌ విభాగంలో పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లు, సంక్షేమ–విద్యా అసిస్టెంట్లు, మహిళా పోలీసు ఉండగా, టెక్నికల్‌ విభాగంలో వీఆర్వోలు, ఏఎన్‌ఎంలు, వ్యవసాయ కార్యదర్శులు, ఇంజనీరింగ్‌, ఎనర్జీ అసిస్టెంట్లు ఉంటారు. జనాభా ఆధారంగా ప్రతి సచివాలయంలో 6 నుంచి 8 మంది సిబ్బంది ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. దీని వల్ల పని భారం సమంగా పంచబడుతూ సేవల నాణ్యత మెరుగుపడనుంది.

Secretariat | సాంకేతికతతో గ్రామాభివృద్ధి..

సేవల నాణ్యతను మరింత పెంచేందుకు ప్రతి సచివాలయంలో ఒక యాస్పిరేషనల్‌ సెక్రటరీని నియమించాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆధునిక ఆలోచనలు, సాంకేతిక అవగాహన ఉన్న ఈ కార్యదర్శుల ద్వారా కృత్రిమ మేధ, డ్రోన్‌ (Drone) వంటి సాంకేతికతను గ్రామాల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఇంటిని జియోట్యాగింగ్‌ చేయడం ద్వారా గ్రామ స్థాయిలో సమగ్ర డేటా సేకరించి, అభివృద్ధి ప్రణాళికలను మరింత ఖచ్చితంగా అమలు చేయనున్నారు. కనీసం 2,500 మంది జనాభాకు లేదా 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సచివాలయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో అవసరమైతే అదనంగా సచివాలయాలు ఏర్పాటు చేయనున్నారు. సచివాలయాల పని తీరును క్రమం తప్పకుండా అంచనా వేసి, మెరుగైన సేవలు అందించే సిబ్బందికి ప్రోత్సాహకాలు, బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. సిబ్బందికి సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు ప్రముఖ సంస్థల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే సమాచార లోపం ఉన్న కుటుంబాల నుంచి పూర్తి వివరాలు సేకరించి డేటాబేస్‌ను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Secretariat

Secretariat | క్లస్టర్ విధానం..

జిల్లాలోని 612 సచివాలయాలను 31 క్లస్టర్లుగా కుదించారు. రెండు లేదా మూడు సచివాలయాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, ఏదైనా ఒక సచివాలయంలో ఉద్యోగి అందుబాటులో లేకపోతే, అదే క్లస్టర్‌లోని మరో సచివాలయంలోని ఉద్యోగి అవసరమైన చోటకు వెళ్లి విధులు నిర్వహించే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ల ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా ప్రజలకు తక్షణ సేవలు అందేలా వ్యవస్థను రూపొందించారు. ప్రజలకు (Peoples) ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ఈ విధానం ఉపయోగపడనుంది. అలాగే గ్రామ రెవెన్యూ అధికారిని గ్రామ అభివృద్ధి అధికారిగా మార్చడం ద్వారా వారి పాత్రను మరింత విస్తరించారు.

డివిజన్ స్థాయిలో డివిజనల్‌ డెవలప్మెంట్‌ (Devolepment) అధికారులకు మరిన్ని అధికారాలు ఇచ్చి, పాలనా వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. వ్యక్తిపూజకు తావు లేకుండా సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్ల పై వ్యక్తిగత ఫొటోలు కాకుండా కేవలం ప్రభుత్వ లోగో మాత్రమే ముద్రించాలని ఆదేశించడం ద్వారా వ్యవస్థకే ప్రాధాన్యతనిచ్చే సంప్రదాయ దృక్పథాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా ఈ మార్పులతో గ్రామ, వార్డు సచివాలయాలు అభివృద్ధి కేంద్రాలుగా మారి, ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించే కీలక వ్యవస్థగా నిలవనున్నాయి. పరిపాలన నిజంగా ప్రజల గడప దాటేలా చేస్తున్న ఈ సంస్కరణలు రాబోయే రోజుల్లో గ్రామీణ పాలనకు ఆదర్శంగా నిలవనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

CLICK HERE TO READ 6 జోన్లు.. 2 మల్టీ జోన్లు..

CLICK HERE TO READ MORE

Leave a Reply