పీఎంసీ పాఠశాలల తనిఖీ..

పీఎంసీ పాఠశాలల తనిఖీ..

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కార్వేటినగరం మండలం కత్తిరిపల్లెలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాలను కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి (National Highways & Infrastructure) అన్షు మన్షి కోయిల్ సూక్ష్మంగా పరిశీలించారు. పీఎం శ్రీ పాఠశాలల తనిఖీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆమె కత్తిరిపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించి, పాఠశాలలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, మౌలిక వసతులు, బోధన-అభ్యసన విధానాలను సమగ్రంగా పరిశీలించారు.

సందర్శన సందర్భంగా ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల పఠన, అభ్యసన స్థాయిలను ప్రత్యేకంగా పరిశీలించిన ఆమె, విద్యార్థులతో నేరుగా మట్లాడుతూ వారి నేర్చుకునే విధానంపై వివరాలు తెలుసుకున్నారు. సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, పాల్ ల్యాబ్‌లను పరిశీలించి, విద్యార్థులు నిర్వహించిన ప్రయోగాలను వీక్షించి అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు ల్యాబ్‌ల వినియోగం మరింత మెరుగుపరచాలని సూచనలు చేశారు.

పీఎం శ్రీ నిధులతో అభివృద్ధి చేసిన క్రీడా మైదానం, రన్నింగ్ ట్రాక్, కోకో మరియు వాలీబాల్ కోర్టులను కూడా ఆమె పరిశీలించారు. విద్యార్థుల శారీరక దృఢత్వం, క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి అవసరమైన క్రీడా సామగ్రి సరఫరా, వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, విద్యార్థుల పాల్గొనిక, ఉపాధ్యాయుల బోధన విధానం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ తనిఖీ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి కే. రాజేంద్రప్రసాద్, సమగ్ర శిక్ష ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంగల్ రాజు, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, రాష్ట్ర పరిశీలకురాలు గీతా, పాఠశాల ఎస్ఎంసి చైర్పర్సన్ ఉమాపతి మరియు ఎస్ఎంసి సభ్యులు పాల్గొన్నారు. అధికారులు పాఠశాల అభివృద్ధి, పీఎం శ్రీ పథకం అమలు, విద్యార్థుల ప్రగతి తదితర అంశాలపై వివరాలను సంయుక్త కార్యదర్శికి వివరించారు.

మొత్తంగా పీఎం శ్రీ పథకం ద్వారా పాఠశాలలో విద్యా నాణ్యత, మౌలిక వసతులు, క్రీడా సదుపాయాలు మెరుగుపడుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్శనతో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహం లభించనుందని విద్యాశాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Leave a Reply