TG | మార్చి 8న మహిళా శంఖరావం.. ఎమ్మెల్సీ కవిత
- పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ కవిత
- శంఖరావం పోస్టర్ విడుదల
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌తో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరాపార్కు వద్ధ మహిళా శంఖారావం నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన జాగృతి సమావేశంలో మహిళా శంఖారావం పోస్టర్ ఆవిష్కరించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకా గాంధీలను తీసుకొచ్చి ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇప్పించారని, మహిళలకు నెలకు ₹2,500 ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఒక్కొక్కరికి 35వేల రూపాయలు బాకీ పడ్డారన్నారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ చేసి అమలు చేయనందుకు ప్రజలు ప్రశ్నిస్తారని తెలిసి భయంతో పారిపోయి రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నారని విమర్శించారు.
ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు..
కేసీఆర్ హయాంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చారని, మహిళలకు పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆడబిడ్డల అభివృద్ధి సంగతేమో గాని భద్రత కూడా కరువైందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన సీసీ కెమెరాల్లో 70శాతం పనిచేయడం లేదన్నారు.
ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు 18ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిర్వహిస్తున్న మహిళా శంఖారావం సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు.