దళిత ఉద్యమ నేత బాబు జగ్జీవన్ రామ్‌కు ఘ‌న నివాళులు..

దళిత ఉద్యమ నేత బాబు జగ్జీవన్ రామ్‌కు ఘ‌న నివాళులు..

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : భారత మాజీ ఉప ప్రధాన మంత్రి, దళిత ఉద్యమ నేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా సాయుధ దళం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏ.ఆర్. డి.ఎస్పీ చిన్ని కృష్ణ పూలమాలలు వేసి బాబూజీ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా డి.ఎస్పీ మాట్లాడుతూ, బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక న్యాయ పోరాట యోధుడిగా విశేష సేవలు అందించారని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన ఆయన నిజమైన ప్రజాస్వామ్యవాది, విశిష్ట పార్లమెంటేరియన్, సమర్థ పరిపాలకుడు, అసాధారణ ప్రతిభ కలిగిన వక్త అని పేర్కొన్నారు.

సమానత్వం, న్యాయం, సామాజిక సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు. సామాజిక అసమానతలు తొలగించి ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఆయన లక్ష్యాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని డి.ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐలు చంద్రశేఖర్, వీరేశ్, ఇతర సిబ్బంది పాల్గొని బాబూజీకి ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply