ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా కీలక ఆదేశాలను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ వీటికి ఆహారం పెట్టవద్దని, ఇందుకోసం కొన్ని నిర్దేశిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ ఈ కొత్త ఆదేశాలు ఇచ్చింది.
ఇటీవలే ఆగస్టు 11న దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలను పూర్తిగా తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల దాడులు పెరిగిపోతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై జంతు హక్కుల సంఘాలతో పాటు పలువురు ప్రముఖుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
దీంతో సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపి తన మునుపటి తీర్పును సవరించింది. రేబిస్ లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా, ఇప్పటికే షెల్టర్లకు తరలించిన కుక్కలన్నింటినీ స్టెరిలైజేషన్ (శుద్ధి ప్రక్రియ) చేసిన తర్వాత తిరిగి విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ కొత్త ఆదేశాలు వీధి కుక్కల బెడదను తగ్గించడానికి, వాటి సంరక్షణకు మధ్య సమతుల్యత సాధించడానికి దోహదపడతాయి. ఈ నిర్ణయం ప్రజల భద్రతతో పాటు జంతువుల హక్కులను పరిగణనలోకి తీసుకుంది. ఈ ఆదేశాలు ప్రజలకు భద్రతను కల్పించడంతో పాటు జంతు సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది.