Savalyapuram | పరుగుల ధీరుడు.. పతకాల సూరుడు..

Savalyapuram | శావల్యాపురం, ఆంధ్రప్రభ : పరుగుల ధీరుడు.. పతకాల సూరుడు… ఆర్మీ జవాన్ పోలా అంకమ్మరావు. రెక్కాడితేనే డొక్కాడని కుటుంబం.. కూలికి పోతే తప్పితే పస్తు పడుకోవాల్సిన దుస్థితి కానీ తన పరుగులో మాత్రం అలుపు లేదు సొలుపు లేదు. తన కుటుంబంలోనే పెద్దదిక్కై అన్ని విధాలా తోడుగా ఉంటూ చదువుకునే వయసులోనే ఆర్మీలో సైనికుడిగా ఉద్యోగం పొందాడు అంకమ్మరావు. కానీ అతని కర్తవ్యం వేరు, అతని ఆశ వేరు. అంతర్జాతీయ పోటీలలో దేశం తరఫున పరిగెత్తాలన్నదే అతని సంకల్పం.

శావల్యాపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన పోలా బక్కయ్య, అంకమ్మలకు నలుగురు సంతానం. ముగ్గురు మగ పిల్లలు, ఒక అమ్మాయి కూడా ఉంది. కుటుంబంలో పెద్ద కొడుకైనా అంకమ్మరావు ప్రాథమిక విద్య కారుమంచిలో చదుకొని, 6 నుండి 10వ తరగతి వరకు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామంలో పూర్తి చేశాడు. అనంతరం ఇంటర్, డిగ్రీ నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతుండగా ఆర్మీ నిర్వహించిన పోటీలలో పాల్గొని అర్హత సాధించి పూణేలోని ఆర్మీ ఆర్డినెన్స్ కోర్లో హవాల్దారుగా జీవనం సాగిస్తూ డిగ్రీ మూడవ సంవత్సరం పూర్తి చేశాడు. ఇప్పటి వరకు కొట్టుమిట్టాడని కుటుంబంలో ఆర్మీ సైనికుడిగా ఉద్యోగం రావడంతో కుటుంబ పోషణ కూడా కొంచెం మెరుగుపడింది.

ఉద్యోగ సమయంలోనే 2009 నుండి 2020 వరకు మార్షల్ ఆర్ట్స్ లో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని మూడుసార్లు బంగారు పతకాలు సాధించాడు. 42 కిలోమీటర్ల పరుగు పందెం 35 పోటీల్లో పాల్గొని అబ్బురపరిచాడు. 21 కిలోమీటర్ల పరుగు పందెం సుమారు 60 పోటీల్లో పాల్గొని అందర్నీ ఆకట్టుకున్నాడు. 10 కీ. మీ, 5 కీ.మీ పరుగు పందెంలో కొన్ని వందలసార్లు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ చూపి అనేక మెడల్స్ సాధించాడు. ఇటీవల మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో 10 కీ. మీ, 5 కీ.మీ జాతీయస్థాయిలో పరుగు పందాలు జరిగాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొని తృతీయ స్థానం సాధించి ఆగస్టులో స్విజర్లాండ్ లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు మన దేశం తరపున ఎంపికయ్యాడు. దేశం తరఫున ఎంపికైన అంకమ్మరావును గ్రామ పెద్దలు, మండల స్థాయి నాయకులు అభినందనలతో ముంచెత్తారు.
ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న అంకమ్మరావు..
దేశం తరఫున ఆడుతున్నానని ఆనందం ఒక పక్క, ఆర్థిక ఇబ్బందులతో మరొకపక్క సతమతమైపోతున్నాడు.. అంకమ్మరావు. అంకమ్మ ఆంధ్రప్రభతో మాట్లాడుతూ.. నాలో ఓపిక ఉన్నంత వరకు దేశ, రాష్ట్ర స్థాయిలో జరిగే పరుగు పోటీల్లో పాల్గొంటూనే ఉంటానని, అంతర్జాతీయ పోటీలలో దేశం తరఫున ఆడడం గర్వకారణంగా ఉందని అయితే.. నా పేదరికం కూడా నన్ను వెంటాడుతుందని స్విజర్లాండ్ కు వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని బాధపడ్డాడు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఈయన ప్రతిభను మెచ్చి సాయం అందిస్తారేమో వేచి చూడాలి.
