Sarpanch | గెలుపు పై నరాలు తెగే ఉత్కంఠ..

Sarpanch | గెలుపు పై నరాలు తెగే ఉత్కంఠ..
Sarpanch, నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండలం తాండూర్ లో సర్పంచ్ అభ్యర్థి ఎన్నిక అర్ధరాత్రి వరకు కొనసాగింది. సర్పంచి అభ్యర్థి ఎన్నిక ఉత్కంఠభరితంగా కొనసాగింది. చివరకు గెలుపు నువ్వా..? నేనా..? అన్న రీతిలో ఊగిసలాడింది. చివరకు భూమా యాదాగౌడ్ ను సర్పంచిగా ఒక్క ఓటు తేడాతో గెలిచినట్టు డీఎల్పీవో సురేందర్ ప్రకటించారు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 2079 ఓట్లు పాలయ్యాయి. ఇందులో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు సిద్దిరాములుకు 509 ఓట్లు పొలవగా భూమా యాదాగౌడ్ కు 507 ఓట్లు పాలయ్యాయి. దీంతో యాదాగౌడ్ రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరడంతో అధికారులు రీకౌంటింగ్ చేశారు. అప్పుడు సిద్ధిరాములకు పాలైన ఓట్లలో నుండి 3 ఓట్లు చెల్లనివిగా అధికారులు తేల్చారు.
దీంతో సిద్దిరాములకు 506 ఓట్లకు పడిపోయాడు. 507 ఓట్లతో అంటే ఒక్క ఓటు లీడ్ యాదాగౌడ్ కు లభించడంతో విజయం ఖాయమైంది. కానీ.. సిద్దిరాములు రీకౌంటింగ్ జరిగిన తీరు పై అసంతృత్తి వ్యక్తం చేస్తూ తిరిగి రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరారు. ఉన్నతాధికారుల అనుమతితో రీ కౌంటింగ్ చేస్తామని అధికారులు తెలిపారు. రీకౌంటింగ్ కోసం ఉన్నతాధికారుల నుండి అనుమతి వచ్చిందో రాలేదో ఖచ్ఛితమైన సమాచారం అందలేదు. కానీ అప్పటికే గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. పరిస్థితులు చేయిదాటిపోతాయేమోనని పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ టెన్షన్ మధ్య భూమా యాదాగౌడ్ సర్పంచిగా గెలుపొందినట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో హైటెన్షన్ కు తెరపడ్డట్టు అయింది.
