మునిసిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..

మునిసిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..

పారిశుధ్యం, సుందరీకరణ, ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి…
ప్రజలకు సేవలు అందించాలి..
నంద్యాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్.. రాజకుమారి గణియా..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల మునిసిపాలిటీని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లి ఉత్తమ మునిసిపాలిటీగా నిలబెట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. మునిసిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె, పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్, స్పెషల్ అధికారి రాజకుమారి మాట్లాడుతూ పట్టణంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, ఆదాయ వనరుల పెంపు, పౌర సేవల మెరుగుదల వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని, ప్రతి విభాగం సమన్వయంతో పని చేస్తేనే మునిసిపాలిటీ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

అదేవిధంగా, పట్టణ అభివృద్ధి పనులను సమయపాలనతో పూర్తి చేయాలని, పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. నంద్యాల మున్సిపాలిటీ జిల్లా కేంద్రంగా ఉండటంతో అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, అందుబాటులో ఉన్న వనరులతో పాటు కొత్త వనరులను సృష్టిస్తూ మునిసిపాలిటీని ప్రగతి పథంలో నడిపించాల్సిన అవసరం ఉందని  పేర్కొన్నారు.

నగర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశిస్తూ, ప్రతి ఇంటి నుండి 100 శాతం చెత్త సేకరణ జరగాలని సూచించారు. సేకరించిన చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి తడి చెత్త నుండి ఎరువు తయారీ, పొడి చెత్త ద్వారా సంపద సృష్టి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. పాత డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్ ద్వారా తొలగించి నగరాన్ని పరిశుభ్రంగా మార్చుతామని చెప్పారు. మునిసిపాలిటీలో విలీనమైన ఆరు గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

అలాగే నగర ప్రవేశ ద్వారం నుండి అంతర్గత ప్రాంతాల వరకు సుందరీకరణ పనులు చేపట్టి, విస్తృతంగా పచ్చదనం పెంచుతామని తెలిపారు. ఈ చర్యల ద్వారా నంద్యాలను స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో ముందంజలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల కోసం మునిసిపల్ ఆదాయ వనరులను పెంపొందించడం అత్యవసరమని, హౌస్ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, బిల్డింగ్ ప్లాన్ చార్జీలు, ఖాళీ స్థలాల పన్నులు తదితరాలను ప్రజలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

బకాయిలపై సమీక్ష నిర్వహించి ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. మంత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ నంద్యాల మునిసిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు టౌన్ ప్లానింగ్ అధికారులు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply