తెలంగాణలో ఆంధ్ర ఇసుక మాఫియా

తెలంగాణలో ఆంధ్ర ఇసుక మాఫియా
- దమ్మపేటలో యథేచ్ఛగా ఆంధ్రా ఇసుక దందా
- సరిహద్దుల్లో కరువైన అధికారుల పర్యవేక్షణ
దమ్మపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కఠిన ఆదేశాలు జారీ చేసినా సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం , దమ్మపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుండటమే ఇందుకు నిదర్శనం. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దమ్మపేట మండలానికి నిత్యం గుట్టుచప్పుడు కాకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా క్షేత్రస్థాయి యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలోతెలిపారు. ఎక్కడైనా ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే,తక్షణమే సదరు జిల్లా కలెక్టర్, ఎస్పీలను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్లు ప్రతి నెలా కనీసం 10 రోజులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇంతటి కఠిన ఆదేశాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కావాల్సి ఉన్నప్పటికీ,దమ్మపేట మండలంలో ఆంధ్రా ఇసుక దందా ఏమాత్రం ఆగకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనం . ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం దమ్మపేట సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి ,పకడ్బందీగా తనిఖీలు చేపడితే , ఈ అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం వుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
